కార్పొరేట్‌ ఆఫీసుల్లో ‘పాలిటోస్‌’ రెస్టారెంట్స్‌

3 Jul, 2018 02:02 IST|Sakshi

హంగర్‌ బాక్స్‌తో భాగస్వామ్యం

మెట్రో స్టేషన్లలోనూ ఔట్‌లెట్లు

రూ.4 కోట్లతో ప్రాసెసింగ్‌ యూనిట్‌

ప్రోవెంచర్‌ డైరెక్టర్‌ అనిల్‌ దొండ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చికెన్‌ క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న పాలిటోస్‌ కార్పొరేట్‌ బాట పట్టింది. ఫుడ్, కెఫెటేరియాల నిర్వహణలో ఉన్న హంగర్‌ బాక్స్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో 170 కార్పొరేట్‌ కంపెనీల్లో రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు పాలిటోస్‌కు మార్గం సుగమం అయింది.

మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇన్ఫోసిస్, క్యాప్‌జెమిని, జీఈ, టీసీఎస్‌ వంటి సంస్థల కార్యాలయాల్లో పాలిటోస్‌ రెస్టారెంట్లు దర్శనమీయనున్నాయి. క్యాప్‌జెమిని పుణే క్యాంపస్‌లలో 2 ఔట్‌లెట్లు ఇప్పటికే ప్రారంభించింది. ఇతర సంస్థల్లో 17 కేంద్రాల ఏర్పాటుకై భాగస్వాములతో ఒప్పందం కుదిరిందని పాలిటోస్‌ను ప్రమోట్‌ చేస్తున్న ప్రోవెంచర్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అనిల్‌ దొండ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఒక్కో రెస్టారెంట్‌ ద్వారా 10–12 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

మెట్రో అన్ని స్టేషన్లలో..
ఎల్‌అండ్‌టీతో ఇటీవలే ప్రోవెంచర్‌ చేతులు కలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌ మెట్రో అన్ని స్టేషన్లలో పాలిటోస్‌ రెస్టారెంట్లు ఏర్పాటు కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఏడు పాలిటోస్‌ స్టోర్లు ఉన్నాయి. వియత్నాంలో రెండు కేంద్రాలు ఉన్నాయి. యూఎస్‌ సహా అన్ని దేశాల్లోనూ అడుగుపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

అయితే అద్దె, విద్యుత్‌ చార్జీలు లేకపోవడంతో కార్పొరేట్‌ కార్యాలయాల్లోని పాలిటోస్‌ రెస్టారెంట్లలో ఉత్పత్తుల ధర 15–18 శాతం తక్కువగా ఉంటుంది. కంపెనీకి 10 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.ప్రాంతాన్నిబట్టి ఫ్రాంచైజీకి రూ.15–35 లక్షలు అవుతుంది. విస్తరణ కోసం కంపెనీ రూ.10 కోట్లు సమీకరించే పనిలోఉంది.  

ఆధునిక టెక్నాలజీతో..
హైదరాబాద్‌ సమీపంలోని కందుకూరు వద్ద సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను కంపెనీ నెలకొల్పింది. 3.2 ఎకరాల విస్తీర్ణంలో రూ.4 కోట్ల వ్యయంతో దీనిని స్థాపించారు. గోద్రెజ్‌ టైసన్‌ నుంచి చికెన్‌ను కొనుగోలు చేస్తోంది. ‘‘ప్రాసెసింగ్‌ యూనిట్లో బ్లాస్ట్‌ ఫ్రీజింగ్‌ టెక్నాలజీని వినియోగించాం.

దిగ్గజ సంస్థల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. చికెన్‌ ఉత్పత్తులు కలుషితం కావు. బ్యాక్టీరియా దరిచేరదు. 8 నుంచి 12 నెలలపాటు ఉత్పత్తులు నిల్వ ఉంటాయి. ఈ యూనిట్‌ నుంచే కోల్డ్‌ చైన్‌ ద్వారా అన్ని కేంద్రాలకు సరఫరా చేస్తాం. రెస్టారెంట్లలో ప్రత్యేక ఓవెన్లను ఏర్పాటు చేశాం’’ అని అనిల్‌ వివరించారు. 

మరిన్ని వార్తలు