ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ ఊరట!

22 Aug, 2015 01:50 IST|Sakshi
ఎఫ్‌ఐఐలకు ‘మ్యాట్’ ఊరట!

♦ మ్యాట్ విధింపునకు తగిన {పాతిపదిక లేదన్న షా కమిటీ
♦ సిఫార్సుల అమలుకు సానుకూలంగా ప్రభుత్వం
 
 న్యూఢిల్లీ : వివాదాస్పద కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) అంశంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (ఎఫ్‌ఐఐ) ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌ఐఐలు గతంలో ఆర్జించిన క్యాపిటల్ గెయిన్స్‌పైన మ్యాట్ విధించడానికి సరైన ప్రాతిపదికేమీ కనిపించడం లేదని ఈ అంశంపై అధ్యయనానికి ఏర్పాటైన ఎ.పి. షా కమిటీ అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జూలై 24న నివేదికను సమర్పించింది. 2015 ఏప్రిల్ 1కి ముందు ఎఫ్‌ఐఐల క్యాపిటల్ గెయిన్స్‌పై మ్యాట్ విధించడానికి చట్టబద్ధంగా ఎటువంటి ప్రాతిపదిక లేదని కమిటీ 66 పేజీల నివేదికలో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

అటు ప్రభుత్వం కూడా కమిటీ సిఫార్సుల అమలుకు సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. అయితే, చట్టాలపరంగా కొన్ని అంశాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని వివరించాయి. క్యాజిల్‌టన్ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉన్నందున నివేదిక వివరాలను ప్రభుత్వం గోప్యంగానే ఉంచుతున్నట్లు వివరించాయి. గత క్యాపిటల్ గెయిన్స్‌పై మ్యాట్ విధిస్తూ దాదాపు రూ. 603 కోట్లు కట్టాలంటూ 68 ఎఫ్‌ఐఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపింది.

మ్యాట్ తమకు వర్తించదని, అందుకే తాము కట్టలేదంటూ కొందరు ఎఫ్‌ఐఐలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ పరిణామాలు దేశీ మార్కెట్లను భారీగా కుదిపేశాయి. దీంతో ఎఫ్‌ఐఐలకు మ్యాట్ వర్తించే అంశాన్ని అధ్యయనం చేసి తగు సిఫార్సులు చేసేందుకు కేంద్రం ప్రత్యేక కమిటీని నియమించింది. విదేశీ ఇన్వెస్టర్లు గత ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్లలో దాదాపు 20 బిలియన్ డాలర్లు, బాండ్లలో సుమారు 28 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారని అంచనా.

>
మరిన్ని వార్తలు