జీఎస్‌టీ బిల్లు, రేట్ల కోత అంచనాలతో..

17 Aug, 2015 01:28 IST|Sakshi
జీఎస్‌టీ బిల్లు, రేట్ల కోత అంచనాలతో..

ఈ వారం మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్
విశ్లేషకుల అంచనా
ముంబై:
ఆర్థిక సంస్కరణలు జరగవచ్చన్న అంచనాలు, ఆర్‌బీఐ రేట్లు తగ్గిస్తుందన్న ఆశలతో ఈ వారం స్టాక్ మార్కెట్ పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీఎస్‌టీ బిల్లును ఆమోదింపచేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఇన్వెస్టర్లు హర్షిస్తున్నారని, గడువు తేదీకల్లా జీఎస్‌టీని అమలు చేయవచ్చన్న అంచనాలు మార్కెట్లో పెరిగాయని జైఫిన్ అడ్వయిజర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ దేవేంద్ర నావ్గి చెప్పారు. లోక్‌సభ, రాజ్యసభల్ని సంయుక్తంగా సమావేశపర్చి ప్రభుత్వం బిల్లుకు ఆమోదముద్ర వేయిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది జరిగితే మార్కెట్‌కు మంచి సంకేతమేనని అన్నారు.
 
బ్యాంకింగ్ షేర్లపై ఫోకస్
గతవారం విడుదలైన ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో రిజర్వుబ్యాంక్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గింవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. టోకు ద్రవ్యోల్బణం మైనస్ 4.05 స్థాయికి తగ్గగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.78 శాతానికి పడిపోయింది. ఇవి రెండూ రికార్డు కనిష్టస్థాయిలే. పారిశ్రామికోత్పత్తి వృద్ధి 3.8 శాతానికి మెరుగుపడింది. ఒకవైపు ద్రవ్యోల్బణం తగ్గడం, మరోవైపు ఉత్పత్తి పెరగడంతో మార్కెట్లో రేట్ల కోత ఆశలు ఎగిసాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. దీంతో ఈ వారం బ్యాం కింగ్ షేర్లు పెరగవచ్చని ఆయన అంచనావేశారు. పీఎస్‌యూ బ్యాంకులకు తాజా మూలధనాన్ని అందించడంతో పాటు బ్యాంకింగ్ సంస్కరణలకు కేంద్రం తెరతీయడంతో వీటిపై ఇన్వెస్టర్ల ఫోకస్ వుంటుందని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా చెప్పారు.
 
కరెన్సీ కదలికల ప్రభావం...

ఇదే సమయంలో కమోడిటీ ధరలు, రూపాయి, చైనా కరెన్సీ యువాన్‌ల కదలికలు భారత్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు. గతవారం చైనా తన కరెన్సీని ఆశ్చర్యకరంగా డీవాల్యూ చేయడంతో ఆసియా అంతటా కరెన్సీ యుద్ధం జరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. అమెరికా  ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాల నేపథ్యంలోనే యువాన్ డీవాల్యూయేషన్ జరగడం ఇన్వెస్టర్ల ఆందోళనల్ని పెంచింది. దీంతో విదేశీ ఫండ్స్ భారత్ మార్కెట్లో అమ్మకాలు జరి పాయి. కానీ వారాంతంలో రూపాయి, యువాన్‌లు స్థిరపడటం ఊరటనిచ్చిందని హెమ్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ వినీత్ మహ్నోట్ అన్నారు.
 
విదేశీ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు
ఆగస్టు నెల తొలి పక్షం రోజుల్లో భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 800 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. వాస్తవంగా తొలివారంలో ఎఫ్‌పీఐలు రూ. 2,200 కోట్ల నికర పెట్టుబడులు చేసినా, రెండోవారంలో రూ. 3,000 కోట్ల మేర వెనక్కు తీసుకోవడంతో ఆగస్టు 1-14 తేదీల మధ్య రూ. 800 కోట్ల నికర అమ్మకాలు జరిపినట్లయ్యింది.

>
మరిన్ని వార్తలు