నల్లకుబేరులపై 137% పన్ను!

27 Dec, 2016 06:53 IST|Sakshi
నల్లకుబేరులపై 137% పన్ను!

చండీగఢ్‌: నల్ల కుబేరులపై ఆదాయ పన్ను విభాగం మరిన్ని కఠిన చర్యలు ప్రకటించింది. తనిఖీలు చేసినప్పుడు లెక్కల్లో చూపని ఆదాయాలకు సంబంధించి సరైన వివరాలు ఇవ్వలేకపోతే ఏకంగా 137 శాతం దాకా పన్నులు, జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించింది. ఒకవేళ, తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని ఆదాయం ఉన్నట్లు అంగీకరించడంతో పాటు దానికి సంబంధించి సరైన వివరణ ఇచ్చిన పక్షంలో 107.25 శాతం దాకా పన్నులు, జరిమానా ఉండగలవని ఆదాయ పన్ను విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ట్యాక్సేషన్‌ చట్టాలను సవరించినట్లు పేర్కొంది. గతంలో పన్నులు కట్టని మొత్తాలను ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన 2016 పథకం కింద బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసి, నిర్దిష్ట పన్నులు చెల్లించడం ద్వారా ఊరట పొందవచ్చని ఆదాయ పన్ను విభాగం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ (ఎన్‌డబ్ల్యూఆర్‌) రాజేంద్ర కుమార్‌ తెలిపారు.

డిసెంబర్‌ 17న ప్రవేశపెట్టిన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31దాకా అమల్లో ఉంటుంది. మరోవైపు, తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని.. పన్నులు కట్టని ఆదాయం బైటపడి, సదరు అసెసీ తగిన వివరణ ఇవ్వలేకపోతే 60 శాతం పన్ను, 60 శాతం పెనాల్టీ, 15 శాతం సర్‌చార్జీ, 3 శాతం విద్యా సెస్సు సర్‌చార్జీ.. మొత్తం కలిపి 137.25 శాతం మేర కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ తనిఖీ సమయంలో లెక్కల్లో చూపని ఆదాయాన్ని అంగీకరించడంతో పాటు, తగిన వివరణ ఇచ్చిన పక్షంలో 60 శాతం పన్ను, 30 శాతం పెనాల్టీ, 15 శాతం సర్‌చార్జి, 3 శాతం విద్యా సెస్సు సర్‌చార్జ్‌.. మొత్తం కలిపి 107.25 శాతం కట్టాల్సి వస్తుంది. డీమోనిటైజేషన్‌ అనంతరం రూ. 2.50 లక్షల పైగా డిపాజిట్లు జరిగిన సేవింగ్స్‌ ఖాతాలు, రూ. 12.50 లక్షల పైగా డిపాజిట్లు జరిగిన కరెంటు అకౌంట్ల ఖాతాల వివరాలు జనవరి 31 నాటికి తమ చేతికి అందుతాయని ఆదాయ పన్ను విభాగం వర్గాలు తెలిపాయి. అనుమానాస్పద లావాదేవీలు జరిపిన వారికి ఫిబ్రవరి నుంచి నోటీసులు పంపడం ప్రారంభిస్తామని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు