ప్రత్యేక సంస్థగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌?

15 Nov, 2019 11:17 IST|Sakshi

అధ్యయనం చేస్తున్న తపాలా శాఖ

కోల్‌కతా: భారతీయ తపాలా శాఖ తన బీమా వ్యాపార విభాగం ‘పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌’ను (పీఎల్‌ఐ) ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ గౌతమ్‌ భట్టాచార్య గురువారం కోల్‌కతాలో మీడియాకు చెప్పారు. పీఎల్‌ఐ పథకాలు గతంలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకే పరిమితం కాగా, ఇప్పుడు లిస్టెడ్‌ కార్పొరేట్‌ సంస్థలు, వృత్తి నిపుణులు సైతం వీటిని తీసుకునే అవకాశం కల్పించినట్టు చెప్పారు. పీఎల్‌ఐ మార్కెట్‌ వాటా 3 శాతంగా ఉండగా, పాలసీదారులకు బోనస్‌ మాత్రం ఇతర బీమా సంస్థలతో పోలిస్తే అధికంగా ఇస్తోంది. కమీషన్‌ చెల్లింపులు తక్కువగా ఉండడంతోపాటు నిర్వహణ వ్యయాలు కూడా తక్కువగా ఉండడమే అధిక బోనస్‌ చెల్లింపులకు కారణమని భట్టాచార్య తెలిపారు. ప్రస్తుతం తపాలా శాఖ ఆదాయంలో 60 శాతం సేవింగ్స్‌ పథకాల ద్వారానే వస్తోందని, పార్సెల్‌ మెయిల్స్‌ నుంచి వచ్చే ఆదాయన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు.

మరిన్ని వార్తలు