పౌల్ట్రీకి 1,750 కోట్ల నష్టాలు

3 Mar, 2020 06:06 IST|Sakshi

న్యూఢిల్లీ: చికెన్‌ వల్ల కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) ప్రబలుతోందన్న వదంతుల మూలంగా పౌల్ట్రీ పరిశ్రమ గణనీయంగా దెబ్బతింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 1,750 కోట్ల మేర నష్టాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో తక్షణం సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ కేంద్ర పశు సంవర్ధక శాఖకు పౌల్ట్రీ రంగం విజ్ఞప్తి చేసింది. చికెన్‌కు డిమాండ్‌ తగ్గిపోవడంతో కోళ్ల ధరలు కేజీకి రూ. 10–30 స్థాయికి (ఫాం గేట్‌) పడిపోయినట్లు అఖిల భారత పౌల్ట్రీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ (ఏఐపీబీఏ) వెల్లడించింది. మరోవైపు సగటు ఉత్పత్తి ధర కేజీకి రూ. 80గా ఉంటోందని వివరించింది.

‘సోషల్‌ మీడియాలో పదే పదే వదంతులు వ్యాప్తి కావడంతో.. చికెన్‌పై వినియోగదారుల నమ్మకం సడలింది. చికెన్‌ ఉత్పత్తుల డిమాండ్‌ పడిపోయింది’ అని ఏఐపీబీఏ చైర్మన్‌ బహదూర్‌ అలీ తెలిపారు. దీంతో జనవరి మూడో వారం నుంచి ఫిబ్రవరి మూడో వారం మధ్య కాలంలో బ్రాయిలర్‌ రైతులు, బ్రీడింగ్‌ సంస్థల నష్టాలు దాదాపు రూ. 1,750 కోట్లకు చేరాయని ఆయన వివరించారు. ఈ భారీ సంక్షోభంతో పౌల్ట్రీ రంగం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగిన పక్షంలో ప్రతి నెలా రూ. 1,750 కోట్ల నష్టాల భారం పడుతుందన్నారు. దేశీ పౌల్ట్రీ లో 10 లక్షల మంది పైగా రైతులు ఉపాధి పొందుతున్నారు. దేశీయంగా జొన్న, సోయాబీన్ల వినియోగం ఎక్కువగా పౌల్ట్రీ రంగంలోనే ఉంటోందని.. ఇది గానీ దెబ్బతిందంటే ఆయా రైతులకూ కష్టం తప్పదని అలీ తెలిపారు.

>
మరిన్ని వార్తలు