ఓ.. ఇతను ఆ బాహుబలినా?

22 Dec, 2018 02:41 IST|Sakshi

హీరో ప్రభాస్‌కు దక్కని ఊరట.. 

ప్రభుత్వ కౌంటర్‌ పరిశీలించకుండా ఉత్తర్వు లివ్వలేమన్న హైకోర్టు

 స్పష్టం చేసిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం 

విచారణ ఈ నెల 31కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ప్రభాస్‌కు ఊరట దక్కలేదు. రెవెన్యూ అధికారులు వేసిన తాళాన్ని తీసి, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పెన్మక్తలోని సర్వే నం. 5/3లో ఉన్న తన 2,083 చదరపు గజాల స్థలం విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌  కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

చట్టబద్ధంగా కొనుగోలు చేశాం.. 
ప్రభాస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ఈ స్థలాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేశారని తెలిపారు. ఈ స్థలం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, అయినా పిటిషనర్‌ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అది అధికారుల పరిశీలనలో ఉందని కోర్టుకు నివేదించారు. రెవెన్యూ అధికారులు ఇటీవల ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా చెబుతూ, గేటుకు తాళం వేశారని చెప్పారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వే నెంబర్‌ 5/3లో ఉన్నది ప్రభుత్వ భూమి అని చెప్పారు. క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది దారిద్య్ర రేఖకు (బీపీ ఎల్‌) దిగువన ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ బీపీఎల్‌ పరిధిలోకి వస్తారా అని ప్రశ్నించింది.

అయితే ప్రభాస్‌ బీపీఎల్‌ పరిధిలోకి రారని, ఆయన బాహుబలి అని శరత్‌ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఓ ఇతను ఆ బాహుబలినా.. మరి పిటిషన్‌లో ఉన్న పేరు అతనిదేనా? అంటూ ఆరా తీసింది. పిటిషనర్‌ అతనేనని నిరంజన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. కాగా, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని ధర్మాసనానికి శరత్‌ చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆ స్థలంలో ఉన్న భవనాన్ని కూల్చివేసే ఉద్దేశం తమకు లేదన్నారు. ప్రభాస్‌ తన వాదనలు చెప్పుకొనేందుకు తగిన సమయం ఇస్తామని చెప్పారు. అయితే కనీసం గేటు తాళం తీసి, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నిరంజన్‌ అభ్యర్థించారు. అయితే, దీనిపై ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. 

మాకు ప్రయోజనం లేదు.. 
యథాతథస్థితి (స్టేటస్‌) ఉత్తర్వుల జారీకి ధర్మాసనం ప్రతిపాదించింది. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే మధ్యంతర ఉత్తర్వుల జారీని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం తమిళనాడులో ఉదంతాన్ని గుర్తు చేసింది. అక్కడ సొంత భూముల్లో అనుమతుల్లేకుండా భవనాలు కట్టుకుని, ఆ తర్వాత క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటారని, ఇక్కడ ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే భవనాలు కట్టుకుని, క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుంటున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఆస్తిని పిటిషనర్‌కు అప్పగించే విషయంపై వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. అప్పటికి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు