రూపే కార్డ్ ఆవిష్కరణ

9 May, 2014 01:48 IST|Sakshi
రూపే కార్డును ఆవిష్కరిస్తున్న ప్రణబ్ ముఖర్జీ

- ప్రపంచంలో ఏడవ పేమెంట్ గేట్‌వే
- రైల్వే టికెట్లకు ప్రి పెయిడ్ వేరియంట్

 
న్యూఢిల్లీ: భారత దేశం తన సొంత చెల్లింపుల గేట్‌వే, రూపేను గురువారం ఆవిష్కరించింది. వీసా, మాస్టర్ కార్డ్‌ల మాదిరి ఈ రూపే కార్డ్ కూడా ఏటీఎంల్లో, మర్చంట్ అవుట్‌లెట్లలో పనిచేస్తుంది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈ కార్డ్‌ను ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఈ రూపే ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసింది. ఈ రూపే ప్లాట్‌ఫామ్ ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా ఇతర బ్యాంకుల్లో క్లియరింగ్, సెటిల్‌మెంట్ లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఆన్‌లైన్ విక్రయాల్లో ఈ రూపే కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇది ప్రపంచంలో ఏడో చెల్లింపు విధానం. త్వరలో ఐఆర్‌సీటీ రూపే కార్డ్‌లో ప్రి పెయిడ్ వేరియంట్‌ను అందించనున్నది. రైల్వే టికెట్ల బుకింగ్‌లో ఈ ప్రి పెయిడ్ వేరియంట్ ఉపయోగపడుతుంది. ఈ రూపే కార్డ్‌ను విదేశాలకు కూడా తీసుకెళ్లేందుకు వీలుగా అమెరికాలోని డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జపాన్‌లోని జేడీసీలతో చర్చలు జరుపుతున్నామని ఎన్‌పీసీఐ చైర్మన్ బాలచంద్రన్. ఎం.  చెప్పారు. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ కార్డ్‌లతో పోల్చితే తక్కువ వ్యయానికే ఈ రూపే కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆర్థిక సేవల కార్యదర్శి జి. ఎస్. సంధు చెప్పారు.

మరిన్ని వార్తలు