మిగిలే ప్రభుత్వ బ్యాంకులు.. ఏడే!

19 Jul, 2014 02:32 IST|Sakshi
మిగిలే ప్రభుత్వ బ్యాంకులు.. ఏడే!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇరవై ప్రైవేటు బ్యాంకుల్ని 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసిన 45 సంవత్సరాల తర్వాత వీటిని ఒకదానిలో మరోదానిని విలీనం చేసేందుకు కొత్త ప్రభుత్వం పావులు కదుపుతోంది.  గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఈ అంశం బ్యాంకింగ్ వర్గాల్లో ఇటీవల బాగా చర్చకు దారితీస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి జి.ఎస్.సంధు మాటలు వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

 ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల మధ్య విలీనాలను చేపడతామని జైట్లీ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా వ్యక్తం చేయడమే కాకుండా, మొన్నటి బడ్జెట్‌లో ఆ దిశగా గట్టి సంకేతాలనే ఇచ్చారు. ఈ ఏడాది కనీసం మూడు ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసే విధంగా ముందుకెళుతున్నామని, ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల్లో ఒకటి రెండుతోపాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సంధు తెలిపారు.

 మిగిలేవి ఎన్ని?
 ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులతో కలుపుకుంటే దేశంలో ప్రస్తుతం 26 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. వీటిలో అత్యధిక బ్యాంకులను కలపడం ద్వారా మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల సంఖ్యను ఏడుకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోందని సమాచారం. ఇందుకోసం ప్రధానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. బ్యాంకులు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకులు అత్యధికంగా విస్తరించి ఉన్న ప్రాంతం, శాఖల సంఖ్య, బ్యాంకుల వ్యవహార శైలి వంటి అంశాల ఆధారంగా బ్యాంకుల మధ్య విలీనాలను ప్రోత్సహిస్తున్నట్లు సంధు తెలిపారు.

 బ్యాంకుల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, వాటి వినియోగం ఆధారంగా ఎస్‌బీఐ క్యాప్ ఇచ్చిన నివేదిక ప్రకారం పీఎస్‌యూ బ్యాంకులను గ్రూపులుగా వర్గీకరించింది. ప్రధానంగా నాలుగు లక్షల కోట్ల వ్యాపారం దాటి ఉండి, నాలుగు వేలకు పైగా శాఖలు కలిగిన బ్యాంకులను ప్రధాన బ్యాంకులుగా చేసి వాటి కింద మిగిలిన బ్యాంకులను చేర్చడం జరిగింది. దీనికి కోర్ బ్యాంకింగ్ సేవలు ఇచ్చి పుచ్చుకోవడానికే అని పేరు పెట్టినప్పటికీ విలీన సమయంలో సాంకేతిక పరిజ్ఞానం విషయంలో బ్యాంకుల మధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీని ప్రకారం ఇప్పటికే పలు బ్యాంకులు కలిసి పనిచేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్‌ను ఓబీసీతో కలిపి బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపులో చేర్చారని, దీని ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్, ఓబీసీలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకింగ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తన పేరెంట్ బ్యాంక్ ఎస్‌బీఐలో విలీనం కానుంది. ఇదే తరహాలో మిగిలిన బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఆంధ్రాబ్యాంక్ సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ స్పందిస్తూ, ప్రభుత్వ బ్యాంకుల మధ్య విలీనాలు తప్పవని, కానీ దీనికి ఇంకా సమయం పడుతుందన్నారు.

 అనుబంధ బ్యాంకుల విలీనం గురించి మూడు నాలుగు నెలల్లో ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుధంతీ భట్టాచార్య ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుబంధ బ్యాంకుల్లో ఎస్‌బీహెచ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో లీడ్ బ్యాంక్‌గా ఉండటంతోఎస్‌బీహెచ్ విలీనం చివర్లో ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా ఇప్పటికే స్టాక్ మార్కెట్లో నమోదైన ఎస్‌బీ బికనీర్ అండ్ జైపూర్, ఎస్‌బీ మైసూర్‌తో అనుబంధ బ్యాంకుల విలీనం మొదలు కావచ్చన్నది అంచనా.

 తట్టుకునే దిశగా..
 రూ. 4 లక్షల కోట్ల వ్యాపారాన్ని, 4,000 మించి శాఖల్ని ఏర్పాటుచేయడం ద్వారా విలీనం నుంచి తప్పించుకోవచ్చని టార్గెట్ బ్యాంకులు భావిస్తున్నట్లు కొంతమంది బ్యాంకింగ్ అధికారుల మాటల్ని బట్టి అవగతమవుతోంది. ఇందుకు ఆయా బ్యాంకులు విభిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు టేకోవర్ టార్గెట్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ తన గ్రామీణ బ్యాంకులను విలీనం చేసుకోవడం, శాఖల విస్తరణ ద్వారా ప్రధాన బ్యాంక్ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తోంది.

మా బ్యాంక్‌కు చెందిన మూడు ఆర్‌ఆర్‌బీలను కలుపుకుంటే బ్యాంకు శాఖల సంఖ్య పెరగడమే కాకుండా మూలధనం కూడా పెరుగుతుందని, దీనికి సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు ఇండియన్ బ్యాంక్ సీఎండీ టి.ఎం.భాసిన్ తెలిపారు. ఇదే దిశగా కెనరా బ్యాంక్ కూడా ఆర్‌ఆర్‌బీలను విలీనం చేసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే తెలిపారు. మరో టేకోవర్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా వచ్చే ఏడాదిలోగా రూ.5 లక్షల కోట్ల వ్యాపార పరిమాణం చేరుకోవడం ద్వారా టాప్ 5 బ్యాంకుల్లో ఒకటిగా నిలవాలనుకుంట్లున్న ఆ బ్యాంక్ సీఎండీ ఎం.నరేంద్ర పేర్కొన్నారు.

 విలీనం ఎందుకు..?
 ప్రపంచంలో టాప్ 10 బ్యాంకులను తీసుకుంటే అందులో మూడు చైనా బ్యాంకులే ఉన్నాయి. కానీ మన దేశంలో 26 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నా ఒక్కటి కూడా వాటి దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా ఒక్క మధ్యస్థాయి ప్రాజెక్టుకు ఒక బ్యాంక్ సొంతంగా రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇందు కోసం నాలుగైదు బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పాటు కావాల్సి వస్తోంది. దీంతో పీఎస్‌యూ బ్యాంకులను కలిపి 5-6 ప్రధాన బ్యాంకులుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 కానీ ఈ నిర్ణయాన్ని బ్యాంకింగ్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. బ్యాంకుల మధ్య విలీనం చేస్తే అవి పెద్ద బ్యాంకులుగా తయారవుతాయే కాని పటిష్టమైన బ్యాంకులు కాలేవని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు అంటున్నారు. బ్యాంకుల విలీనానికి సంబంధించి ప్రధానమైన అడ్డంకి ఉద్యోగుల నుంచే వస్తోంది.

 ప్రస్తుత బ్యాంకుల్లో లభిస్తున్న ప్రయోజనాలు విలీన బ్యాంకుల్లో కలిపించినా, అదే విధంగా ప్రమోషన్ల విషయంలో కూడా స్పష్టమైన విధానం ప్రకటి చినా ఈ సారి ఉద్యోగుల నుంచి పెద్దగా వ్యతిరేకత ఉండకపోవచ్చని కొంతమంది యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నాయర్ కమిటీ సిఫార్సులను తిరస్కరించి, 51 శాతం ప్రభుత్వ వాటాను కొనసాగిస్తామన్న హామీ ఇవ్వడంతో యూనియన్లు పీఎస్‌యూ బ్యాంకుల మధ్య విలీనంపై కొంత మెత్తబడినట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు