ధరలు పెరుగుతూనే ఉంటాయి.. ఏం చేద్దాం?

3 Aug, 2015 01:27 IST|Sakshi

ఐదేళ్ల కిందట ఇంజనీరింగ్ చదవటానికి రెండు లక్షలైతే... ఇపుడు ఆరు లక్షలవుతోంది. మరి మరో పదేళ్ల తరవాతో..? చదువే కాదు. పెళ్లి, ఇల్లు, కారు... దేన్ని తీసుకున్నాళ్లు గడిచేకొద్దీ ఖర్చు పెరిగిపోతూనే ఉంటుంది. కారణమేంటంటే... రూపాయి బలహీనపడటం, ధరలు పెరగటం. మరో మాటలో చెప్పాలంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే... పొదుపు చేసేటపుడైనా, పెట్టుబడులు పెట్టేటపుడైనా ఇలా ఏది చేసినా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దాన్ని కూడా లెక్కగట్టాలి. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న మేరకు ద్రవ్యోల్బణం వచ్చే పదేళ్లలో 5 నుంచి 10 శాతం వరకూ ఉంటుందని భావించవచ్చు. దీన్ని లెక్కగడుతూ భవిష్యత్ అవసరాలను అంచనా వేయటమెలాగో... అందుకు తగ్గ సాధనాలేమిటో చూద్దాం.

 ఈక్విటీ-డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్: దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందడానికి ఈక్విటీ పెట్టుబడులు మంచివే. ఇందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానం (సిప్) ఉత్తమం. దీనికి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులే బెటర్. అయితే మొత్తం సొమ్ము ఈక్విటీల్లోనే పెట్టడం సరికాదు. ఎందుకంటే ఈక్విటీల్లో కొన్ని సందర్భాల్లో రాబడి మాట దేవుడెరుగు... అసలు  దక్కని పరిస్థితి ఉంటుంది. రిస్క్-రాబడిని సమతౌల్యంలో ఉంచుకోడానికి డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో కూడా పెట్టుబడులు పెట్టడం సముచిత నిర్ణయం.

 ఎప్పటికప్పుడు పరిశీలన: ఏదో ఒక సాధనంలో పెట్టుబడులు పెట్టేసి, ఇక పర్వాలేదనుకుంటూ ఇక దాని గురించి పట్టించుకోకపోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ద్రవ్యోల్బణం కదలికలు, ఒకవేళ మీరు ఊహించినదానికన్నా ఈ ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటే... లక్ష్యానికి అనుగుణంగా డబ్బు సమకూరడానికి ఇతర పెట్టుబడుల మార్గాలను అన్వేషిస్తుండాలి. ద్రవ్యోల్బణానికి తగినట్లుగా ప్రభుత్వాలు, సంస్థలు ప్రకటించే పథకాలపై దృష్టి పెట్టాలి. అంటే మీ పెట్టుబడులు-ద్రవ్యోల్బణం- లక్ష్యాలను ఎప్పటికప్పుడు మదింపు చేసుకుంటుండాలన్నమాట.

 బీమాతో ధీమా: జీవితంలో బీమా ధీమా అవసరం. ఇది ఒక కుటుంబ ఆర్థిక ప్రణాళికలు గాడితప్పకుండా కాపాడుతుంది. మీ కుటుంబ లక్ష్యాలకు అనుగుణంగా- తగిన ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు ఎంతో మంచివి. ద్రవ్యోల్బణం బారినుంచి రక్షించుకోడానికి తగిన ఆయుధంగా బీమా కవర్ ఉండాలి. దురదృష్ట వశాత్తూ మీరు లేకపోయినా మీ కుటుంబం అనుకున్న లక్ష్యాన్ని సాధించే స్థాయిలో బీమా కవరేజీ ఉండాలి.

 రిటైర్‌మెంట్ ప్లాన్: కుటుంబ బాధ్యతలకు సంబంధించి ప్రణాళికలు సరే. పదవీ విరమణ తరువాత సైతం ఖర్చులకు సాధ్యమైనంత తొందరగానే పొదుపు, పెట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుని నిధులు సమకూర్చుకోవడం మంచిది. ముందుగానే తగిన ప్రణాళిక ద్వారా ఇక్కడా ధరల సమస్యనుంచి తప్పించుకోవచ్చు. ఉద్యోగం వచ్చిన నాటి నుంచే రిటైర్‌మెంట్ లక్ష్యంగా కొంత డబ్బు పెట్టుబడుల్లోకి మళ్లించాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు