మందగమనానికి మందు.. ఈ 10 అంశాలు

12 Oct, 2017 00:39 IST|Sakshi

 ద్రవ్య స్థిరీకరణ రోడ్‌మ్యాప్‌నకు కట్టుబడి ఉండాల్సిందే

ప్రోత్సాహకాల కోసం దీన్ని పణంగా పెట్టకూడదు

తొలి భేటీలో ప్రధాని ఆర్థిక సలహా మండలి అభిప్రాయం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ రోడ్‌మ్యాప్‌నకు కట్టుబడి ఉండాలని, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల కోసం దీన్ని పణంగా పెట్టకూడదని కొత్తగా ఏర్పాటైన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) అభిప్రాయపడింది. గత నెలలో ఏర్పాటైన ఈ మండలి... బుధవారమిక్కడ నీతి ఆయోగ్‌ సభ్యుడు బిబేక్‌ దేబ్‌రాయ్‌ అధ్యక్షతన తొలిసారి సమావేశమయింది. ఆర్థిక వృద్ధి మందగమనాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ... దీన్ని గాడిలో పెట్టడానికి వచ్చే ఆరు నెలల్లో ప్రధానంగా దృష్టి సారించాల్సిన 10 ప్రాధాన్యాంశాలను ఈ సమావేశం గుర్తించింది. వీటిలో ఉద్యోగాల కల్పనను పెంచటంతో పాటు ఆర్థిక వృద్ధిని వేగవంతం చెయ్యటం, అసంఘటిత రంగాల ఏకీకరణ, ఆర్థిక కార్యాచరణ, ద్రవ్య విధానం, ప్రభుత్వ వ్యయం, ఆర్థిక గవర్నెన్స్‌ వ్యవస్థలు, వ్యవసాయం, పశు సంవర్ధకం, వినియోగ ధోరణులు, ఉత్పత్తి, సామాజిక రంగం వంటివి ఉన్నాయి. ఆయా అంశాల కోసం తగిన వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని, వీటి ద్వారా చేపట్టే చర్యలు చిట్టచివరి స్థాయి వరకూ వెళ్లేలా ఓ కన్నేసి ఉంచాలని సమావేశం అభిప్రాయపడింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ పాల్గొని ఆర్థిక వృద్ధికి పెట్టుబడులు, ఎగుమతులు పెంచడం సహా అందుబాటులో ఉన్న పలు మార్గాల గురించి మండలికి వివరించారు. వృద్ధి మందగమనం నేపథ్యంలో పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాన్ని మీరుతుందా? అన్న ప్రశ్నకు దేబ్‌రాయ్‌ స్పందిస్తూ... ద్రవ్య స్థిరీకరణ కసరత్తు నుంచి పక్క దారి పట్టకూడదన్న విషయమై మండలి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం ఉందన్నారు. వచ్చే నెలలో మండలి మరోసారి అధికారికంగా భేటీ అవుతుందని, ఆ తర్వాత ప్రధానికి సిఫారసులు అందజేస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.2%గా, వచ్చే ఏడాదికి 3%గా ప్రభుత్వం లక్ష్యాన్ని విధించుకుంది.

   

మరిన్ని వార్తలు