సిటీ గ్యాస్‌కు ప్రాధాన్యత!

19 Dec, 2014 00:48 IST|Sakshi
సిటీ గ్యాస్‌కు ప్రాధాన్యత!

కొత్త గ్యాస్ కేటాయింపుల విధానంపై చమురు శాఖ కసరత్తు

న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తూ సహజ వాయువు కేటాయింపుల విధానాన్ని కేంద్రం సవరించింది. దీని ప్రకారం సీజీడీ సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అటు పైన ఆటమిక్ ఎనర్జీ.. స్పేస్ రీసెర్చ్‌కి  అవసరమయ్యేవి సరఫరా చేసే వాటికి రెండో ప్రాధాన్యం ఇవ్వాలని చమురు శాఖ భావిస్తోంది. ఇక పెట్రోకెమికల్స్ మొదలైనవి వెలికితీసే ప్రాజెక్టులకు రోజుకి 1.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంఎస్‌ఎండీ) గ్యాస్‌ను ఇవ్వాలని, నాలుగో ప్రాధాన్యత కింద గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్లకు కేటాయించాలని యోచిస్తోంది. నియంత్రిత టారిఫ్‌ల కింద విద్యుత్‌ను సరఫరా చేసే షరతుపై పవర్ ప్లాంట్లకు తర్వాత స్థానం దక్కుతుంది.

ఇక దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేం దుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కనుంది. ఈ మేరకు ప్రతిపాదనను చమురు శాఖ.. కేంద్ర క్యాబినెట్ ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  దేశీయంగా ఉత్పత్తి చేసే గ్యాస్ కేటాయింపుల్లో ప్రస్తుతం యూరియా తయారీ ప్లాంట్లకు మొదటి ప్రాధాన్యత లభిస్తోంది. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) ప్లాంట్లు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, వాహనాలు.. గృహాలకు గ్యాస్ సరఫరా చేసే సీజీడీ ప్రాజెక్టులు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు