బయో స్టార్టప్ లకు ఈక్విటీ నిధులు

10 Feb, 2016 01:03 IST|Sakshi
బయో స్టార్టప్ లకు ఈక్విటీ నిధులు

బయో ఏషియా సదస్సులో
బైరాక్ ఎండీ రేణు స్వరూప్ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయో టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీలను ఈక్విటీ నిధులను సమకూర్చనున్నట్లు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ (బైరాక్) తెలిపింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనే కనీసం రూ.200 కోట్లతో కార్పస్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు బైరాక్ మేనేజింగ్ డెరైక్టర్ రేణు స్వరూప్ తెలిపారు. మంగళవారం బయో ఏషియా సీఈవో కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ రంగంలో స్టార్టప్‌లకు గ్రాంట్‌ల కింద గత ఐదేళ్లలో రూ. 600 కోట్ల వరకు నిధులను సమకూర్చామని, రెండో దశలో ఇక నుంచి ఈక్విటీ నిధులను సమకూర్చనున్నట్లు ఆమె తెలిపారు.

ఇప్పటి వరకు బయోటెక్నాలజీలో 150 కంపెనీల స్టార్టప్‌లకు ఆర్థిక సహాయాన్ని అందించామని వీటి నుంచి 25 కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినట్లు స్వరూప్ తెలిపారు. ఆర్థిక సహాయం అందుకున్న కంపెనీల్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల కంపెనీలే కావడం గమనార్హం. ప్రస్తుతం 5 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ బయోటెక్నాలజీ రంగం ప్రభుత్వం సహకారం అందిస్తే 2025 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకునే సామర్థ్యం ఉందన్నారు.

అనుమతులు త్వరితగతిన లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ పరిశ్రమ నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీనిని భర్తీ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా సిటీలో ఐఎస్‌బీ తరహాలో 100 ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. ఇందుకు  ఫార్మా కంపెనీల సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు