పెట్రోల్‌ మార్కెట్లో ప్రైవేట్‌ హవా

20 Mar, 2018 00:56 IST|Sakshi

మూడేళ్లలోనే రెట్టింపు వాటా

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ మార్కెట్లో ఎస్సార్‌ ఆయిల్, రిలయన్స్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలు గణనీయంగా వాటా పెంచుకుంటున్నాయి. గత మూడేళ్లలో ఇవి తమ వాటాను రెట్టింపు చేసుకున్నాయి. పెట్రోల్‌ అమ్మకాల్లో 7%, డీజిల్‌ విక్రయాల్లో 8% వాటాకు చేరుకున్నాయి. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభలో ఈ విషయాలు తెలిపారు. 2002 మార్చి నుంచి ప్రైవేట్‌ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్‌ను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చినట్లు, ఆ తర్వాత ఇంధనం ధరలపై నియంత్రణలను కూడా తొలగించినట్లు ఆయన వివరించారు.

దీంతో ఇండియన్‌ ఆయిల్‌ వంటి ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలకు పోటీగా రిలయన్స్, ఎస్సార్, షెల్‌ మొదలైనవి కూడా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేశాయి. 2004–05లో ధరలపై ప్రభుత్వ నియంత్రణ మళ్లీ తిరిగి రావడంతో పోటీపడలేక వెనక్కి తగ్గాయి. ఇక 2010 జూన్‌లో పెట్రోల్‌ ధరలపైనా, 2014 అక్టోబర్‌ నుంచి డీజిల్‌పైనా నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ పరిణామాలన్నింటి దరిమిలా 2015–16లో పెట్రోల్‌ అమ్మకాల్లో 3.5 శాతం, డీజిల్‌ అమ్మకాల్లో 3.1 శాతం ప్రైవేట్‌ కంపెనీల వాటా ఉండేదని ప్రధాన్‌ వివరించారు.

2017–18లో పెట్రోల్‌ అమ్మకాల్లో 6.8%కి, డీజిల్‌ అమ్మకాల్లో 8.2%కి ప్రైవేట్‌ సంస్థల వాటా చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 61,678 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. వీటిలో ఐవోసీవి 26,752, హెచ్‌పీసీఎల్‌వి 14,853, బీపీసీఎల్‌వి 14,293 ఉన్నాయి. ఇక ప్రైవేట్‌ రంగంలో ఎస్సార్‌కి 4,275 పెట్రోల్‌ బంకులు, రిలయన్స్‌కి 1,400, షెల్‌కి 100 బంకులు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు