భారత్‌లోకి మహిళల డేటింగ్‌ యాప్

4 Oct, 2018 10:11 IST|Sakshi

మహిళల డేటింగ్‌ యాప్‌ బంబల్‌ ఇండియాలోకి ఎంట్రీ

బాలీవుడ్‌ నటి ప్రియాంక  చోప్రా పెట్టుబడులు

2017లో  విట్నే వోల్ఫ్‌ హెర్డ్‌  స్థాపించిన బంబల్‌

ప్రత్యేకంగా యువతులు, మహిళల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ బంబల్‌లో బాలీవుడ్‌ నటి ప్రియాం​క చోప్రా పెట్టుబడులు పెడుతున్నారు. మహిళల మొట్ట మొదటి సోషల్ నెట్‌వర్కింగ్‌ యాప్‌  బంబల్‌లో త్వరలోనే భారతదేశంలో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే టెక్‌ స్టార్ట్‌అప్‌ హోల్బెర్టన్ స్కూల్లో పెట్టుబడిదారుగా ఉన్న బాలీవుడ్‌ భామ ప్రియాంక సోషల్ మీడియా, డేటింగ్‌ యాప్‌లో పెట్టుబడిదారుగా, సలహాదారుగా ఇపుడు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఈ భాగస్వామ్యం  విషయాన్ని ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఫార్చ్యూన్‌ అతిశక్తివంతమైన మహిళల సమ్మిట్‌లో బంబల్‌ సీఈవో విట్నే వోల్ఫ్‌హెర్డ్‌ ఈ విషయాన్ని బుధవారం ప్రకటించారు. భారతదేశ మహిళల సాధికారతకు సహాయపడడంతోపాటు ఆమె ప్రపంచశక్తిగా నిలవనున్నారని పేర్కొన్నారు. గత తొమ్మిదినెలలుగా బంబుల్‌ లాంచింగ్‌ పనిలో, వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో ప్రియాంక తలమునకలై వున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు. వారు సురక్షితంగా ఉండాలి. వారుతో అనుసంధానం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. సురక్షితంగా లేని కారణంగా ప్రస్తుత సోషల్ నెట్‌వర్క్‌లు భారతీయ మహిళల హృదయాలను  పెద్దగా ఆకట్టుకోలేకపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తమ యాప్‌లో మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు. ఉదాహరణకు, మహిళలు వారి పూర్తి పేర్లకు బదులుగా తమ ప్రొఫైల్లో కేవలం ఫస్ట్‌ లెటర్‌ ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. 

2017 అక్టోబర్‌లో బంబుల్‌ డేటింగ్‌ యాప్‌ విట్నే వోల్ప్‌  హెర్డ్‌ స్థాపించారు. ఇప్పటికే 160 దేశాలలో పనిచేస్తున్న బంబుల్, ఫోటో వెరిఫికేషన్‌ ఫీచర్‌ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 27 మిలియన్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తుండగా, దాదాపు 4000 కంటెంట్ మోడరేటర్లతో ఫోటోలను, ప్రొఫైల్స్‌ను నిరంతరం రివ్యూ చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి భారతీయ మహిళలకు అందుబాటులోకి రానున్న బంబుల్‌ హిందీ, హింగ్లీషు (హిందీ, ఇంగ్లీషు కలిసిన) భాషల్లో లాంచ్‌కానుంది. ఆండ్రాయిడ్‌, యాపిల్ ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంలపై ఇది పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు