లాభాల్లో బ్యాంక్‌ షేర్లు

30 Mar, 2017 00:55 IST|Sakshi
లాభాల్లో బ్యాంక్‌ షేర్లు

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు
కలసివచ్చిన షార్ట్‌ కవరింగ్‌
122 పాయింట్ల లాభంతో 29,531కు సెన్సెక్స్‌
43 పాయింట్ల లాభంతో 9,144కు నిఫ్టీ


సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం స్టాక్‌  మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. నేడు(గురువారం) మార్చి సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు కారణంగా కొన్ని షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ జరగడంతో స్టాక్‌ సూచీలు ఎగిశాయి. స్టాక్‌ మార్కెట్‌ వరుసగా రెండో రోజూ లాభపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 122 పాయింట్ల లాభంతో 29,531 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో 9,144 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది  వారం గరిష్ట స్థాయి. బ్యాంక్, క్యాపిటల్‌  గూడ్స్‌ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా షేర్లు నష్టపోవడంతో లాభాలు పరిమితమయ్యాయి

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...
అమెరికా వినియోగదారుల విశ్వాస గణాంకాలు పటిష్టంగా ఉండడం, ముడి చమురు ధరలు పెరగడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. ఈ జోష్‌తో బుధవారం ఆసియా మార్కెట్లు(చైనా మినహా) లాభాల్లో ఉండడం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, ఈక్విటీ, డెట్‌ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు జోరుగా ఉండడం, రూపాయి 17 నెలల గరిష్ట స్థాయికి బలపడడం, జీఎస్‌టీ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టడం...,  ఈ అంశాలన్నీ సానుకూల ప్రభావం చూపాయి. విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.6,415 కోట్లు నికర కొనుగోళ్లు జరపడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.

వాహన షేర్లు స్కిడ్‌..
మొండి బకాయిల సమస్య పరిష్కారంపై కసరత్తు చేస్తున్నామని, దీనికి సంబంధించి ఈ వారంలోనే ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ అధికారులు, బ్యాంక్‌ అధినేతలతో సమావేశం అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో బ్యాంక్‌ షేర్ల లాభాల పరుగు బుధవారం కూడా కొనసాగింది. ఎస్‌బీఐ 2 శాతం లాభపడింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 0.7 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2 శాతం చొప్పున పెరిగాయి. భారత్‌ స్టేజ్‌–త్రి వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలను వచ్చేనెల 1 నుంచి  సుప్రీం కోర్ట్‌ నిషేధించడంతో వాహన షేర్లు కుదేలయ్యాయి. హీరో మోటొకార్ప్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, అశోక్‌ లేలాండ్‌ షేర్లు 3 శాతం వరకూ నష్టపోయాయి.30 సెన్సెక్స్‌ షేర్లలో 16 షేర్లు లాభాల్లో, 14 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.8 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 1.2 శాతం, కోల్‌ ఇండియా 1 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్‌ఈలో 1,669 షేర్లు నష్టపోగా, 1,182 షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు