చివర్లో లాభాలు..

17 Oct, 2015 01:33 IST|Sakshi
చివర్లో లాభాలు..

 ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్ల జోరు కారణంగా శుక్రవారం స్టాక్‌మార్కెట్ లాభాల్లో ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ కంపెనీల షేర్లు రికవరీ కావడం, బ్యాంక్ షేర్ల లాభాల వల్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 204 పాయింట్లు లాభపడి 27,215 పాయింట్ల వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 8,238 వద్ద ముగిశాయి. రెండో రోజూ స్టాక్ మార్కెట్లో లాభాలు కొనసాగాయి. నిఫ్టీ 8,200 పాయింట్ల మైలురాయిని దాటేసింది. స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో వారంలోనూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 322 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఎగుమతులు వరుసగా పదో నెలలోనూ క్షీణించడం  కొంత మేర ప్రభావం చూపింది.

అయితే ప్రపంచ మార్కెట్లు లాభాల్లో సాగడం కలసివచ్చింది. ా్యంక్, ఆర్థిక సేవలు, వాహన, ఆయిల్, మౌలిక రంగాల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు ఈఏడాదికి ఉండబోదన్న అంచనాలకు చైనా, జపాన్ ప్రభుత్వాలు ప్యాకేజీలు ఇవ్వనున్నాయన్న సమాచారం తోడవడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో సాగాయి. ఇక ఈ వారంలో సెన్సెక్స్ 135, నిఫ్‌టీ 48 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.  

 ఎల్ అండ్ టీ జోరు...
 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.9 శాతం ఎగసింది. ఎల్ అండ్ టీ 2.8 శాతం లాభపడింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఎస్‌బీఐ 2.3 శాతం,  ఓఎన్‌జీసీ 1.5 శాతం,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 1.3 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.3 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.2 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.2 శాతం, ఎన్‌టీపీసీ 1.2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.1 శాతం చొప్పున పెరిగాయి. డీజిల్ ధర పెంపు కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 0.4 శాతం నుంచి 2 శాతంవరకూ పెరిగాయి.

కాల్ డ్రాప్స్‌కు సంబందించి ట్రాయ్ మార్గదర్శకాల నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్ షేర్లు 1.4  శాతం వరకూ క్షీణించాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, లుపిన్ 2.3 శాతం, టాటా స్టీల్ 1 శాతం, కోల్ ఇండియా 0.9 శాతం చొప్పున నష్టపోయాయి. 1,379 షేర్లు నష్టాల్లో, 1,350 షేర్లు లాభాల్లో ముగిశాయి.

మరిన్ని వార్తలు