మూడేళ్లలో లాభాల్లోకి..

15 Aug, 2015 00:02 IST|Sakshi
మూడేళ్లలో లాభాల్లోకి..

టర్న్ అరౌండ్ అనుకున్నట్టే జరుగుతోంది
♦ ఎతిహాద్‌తో భాగస్వామ్యం బాగా కలిసొచ్చింది
♦ జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేష్ గోయల్ స్పష్టీకరణ
 
 ముంబై నుంచి సాక్షి ప్రతినిధి : వరుస నష్టాల నుంచి తేరకుని మూడేళ్లలో లాభాలు ఆర్జించాలన్న లక్ష్యానికి చేరువయ్యే దిశగా జెట్ ఎయిర్‌వేస్ అడుగులు వేస్తున్నట్లు సంస్థ ైచె ర్మన్ నరేష్ గోయల్ స్పష్టం చేశారు. ఏడు త్రైమాసికాల నష్టాల అనంతరం తొలి సారిగా లాభాలు ఆర్జించామని, సంస్థ తిరిగి గాడిలో పడుతోందనటానికి తగిన సూచనలన్నీ కనిపిస్తున్నాయని చెప్పారాయన. శుక్రవారమిక్కడ క్యూ-1 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అనంతరం ఈక్విటీ భాగస్వామి ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రెసిడెంట్, సీఈవో జేమ్స్ హోగన్, జెట్ సీఈవో క్రామర్ బాల్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘2015లో నష్టాలు తగ్గించుకోవటం, 2016లో కన్సాలిడేట్ కావడం, 2017లో లాభాల్లోకి మళ్లటం అనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. ఇందుకు ఎతిహాద్‌తో భాగస్వామ్యం బాగా ఉపకరిస్తోంది. ఎందుకంటే భాగస్వామ్యం వల్ల మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలు అందుబాటులోకి వచ్చాయి. దేశీయంగా కూడా మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి వచ్చాం. ప్రస్తుతం 21 మంది కోడ్ షేర్ భాగస్వాములున్నారు’’ అని వివరించారు. ఇటీవ లే కొత్త వెబ్‌సైట్‌ను, మొబైల్ యాప్‌ను ఆవిష్కరించామని, తొలిసారి మొబైల్‌లో సెల్ఫ్ చెకింగ్ సేవల్ని అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

ఎతిహాద్ భాగస్వామ్యం తమకెంతో లాభించిందని, ఎక్కువ మంది అందుబాటులోకి రావడం వల్ల రెవెన్యూ పెరిగి లాభాల్లోకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ‘‘ఎతిహాద్‌కు మాది ఫీడర్ ఎయిర్‌లైన్‌గా మారుతుందని, అబుదాబియే హబ్ అవుతుందని వదంతులున్నాయి. అవి సరికాదు. జెట్ ఎయిర్ ఇండియాలో ప్రీమియర్ ఎయిర్‌లైన్స్‌గా ఎదుగుతుంది. ఢిల్లీ, ముంబాయ్ ప్రధాన హబ్‌లుగా ఉంటాయి. అబుదాబి కేవలం గేట్‌వేగా కొనసాగుతుంది’’ అని వివరించారు. ప్రస్తుతం ఇన్ పుట్ వ్యయాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం దీనిపై తగిన పాలసీ తెస్తుందని ఆశిస్తున్నామన్నారు.

 దీర్ఘకాలిక భాగస్వామిగా ఉంటాం..
 ఎతిహాద్ ప్రెసిడెంట్, సీఈవో జేమ్స్ హోగన్ మాట్లాడుతూ.. జెట్‌తో భాగస్వామ్యం వల్ల అబుదాబి నుంచి ఇండియాకు ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. జెట్‌తో తాము భాగస్వామ్యం పెట్టుకోవటమే కాక, ఇన్వెస్టర్లుగా కూడా ఉన్నామని చెప్పారు. ‘‘ మాకు ప్రస్తుతం జెట్‌లో 24% వాటా ఉంది. ఇది దీర్ఘకాలం కొనసాగుతుంది’’ అని చెప్పారు. ఏ ఎయిర్‌లైన్స్‌కయినా నెట్‌వర్క్ కవరేజీ కీలకమని, వివిధ భాగ స్వామ్యాలతో తాము ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌గా అవతరించామని తెలియజేశారు. ‘‘సరైన భాగస్వాముల వల్ల ఉన్న మార్కెట్‌ను స్థిరపరచుకోవడంతో పాటు కొత్త మార్కెట్‌ను కూడా సాధించొచ్చు. అందుకే మేం చాలా సంస్థల్లో నెట్‌వర్క్ భాగస్వాములుగా ఉండటంతోపాటు ఈక్విటీనీ కొనుగోలు చేశాం’’ అన్నారు. తమ సంస్థలో 24,000 మంది ఉద్యోగులు ఉంటే అందులో 5,000 మంది భారతీయులేనని చెప్పారు.

 క్యూ1లో టర్న్ ఎరౌండ్
 జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ తొలి త్రైమాసికంలో రూ. 226 కోట్ల నికరలాభం ఆర్జించి టర్న్ ఎరౌండ్ ఫలితాల్ని ప్రకటించింది.  గతేడాది క్యూ-1లో కంపెనీకి రూ.258 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మూడేళ్లలో పూర్తిగా లాభాల్లోకి మళ్లే క్రమాన్ని ప్రస్తుత ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని జెట్ పేర్కొంది. అలాగే కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.5,097 కోట్ల నుంచి రూ.5,658 కోట్లుకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో  బీఎస్‌ఈలో కంపెనీ షేరు 8 శాతం పెరిగి రూ.400 వద్ద ముగిసింది.
 
 దేశీయంగానూ వేగంగా ఎదుగుదల..
 దేశీయ గమ్యస్థానాలపై ఇన్వెస్ట్ చేస్తున్నామని, ప్రస్తుతం తాము 51 దేశీయ గమ్యస్థానాలకు, 22 అంతర్జాతీయ గమ్య స్థానాలకు విమానాలు నడుపుతున్నామని జెట్ సీఈవో క్రామర్ బాల్ చెప్పారు. ‘‘ రోజుకు దేశీయంగా 481 విమానాలు, అంతర్జాతీయంగా 138 విమానాలు నడుపుతున్నాం. కోడ్ షేర్ భాగస్వామ్యం వల్ల ట్రాఫిక్ ఏకంగా 2014తో పోలిస్తే ఈ ఏడాది 424 శాతం పెరిగింది’’ అని చెప్పారు. నిధుల సమీకరణ ఇంకా వివిధ దశల్లో ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరిన్ని వార్తలు