తనఖా.. తడాఖా!

31 Jan, 2019 02:15 IST|Sakshi

భారీగా షేర్లను కుదువ పెడుతున్న ప్రమోటర్లు

జీ షేర్ల పతనంతో ఉలిక్కిపడ్డ మార్కెట్‌ 

రుణదాతల విక్రయంతో షేర్లు మరింత పతనం

ప్రమోటర్ల తనఖా షేర్లు పెరిగితే ప్రమాదమే! 

దూరంగా ఉంటేనే మేలంటున్న నిపుణులు

(సాక్షి, బిజినెస్‌ విభాగం): ప్రమోటర్లు తమ వాటాలను తనఖా పెట్టి... వాటిపై భారీగా రుణాలు తీసుకుని... ఆ రుణాలను వేరేచోట పెట్టుబడులుగా పెట్టడం ఇపుడు కొత్త సమస్యలకు దారితీస్తోంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ షేర్ల ఉదంతంతో ఇలాంటి కంపెనీలపై ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేయాల్సిన అవసరం మళ్లీ తెరపైకి వచ్చింది. జీ షేర్ల పతనాన్ని అడ్డుకోవడంలో ప్రమోటర్‌ కంపెనీ ఎస్సెల్‌ గ్రూప్‌ విఫలం కావడంతో... 3 రోజుల క్రితం వాటిని తనఖా ఉంచుకున్న ఫైనాన్షియల్‌ సంస్థలు కొన్ని మార్కెట్లో విక్రయిచేశాయి.

ఫలితంగా ఒకేరోజు ఈ షేరు 30 శాతానికి పైగా పతనమైంది. తరవాత కొంత కోలుకున్నా... మొత్తంగా జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేర్‌ ఈ నెలలో 20 శాతానికి పైగా పతనమైంది. ఈ నేపథ్యంలో  షేర్ల తనఖా వ్యవహారమేంటి? ప్రమోటర్లు షేర్లను ఎందుకు తనఖా పెడతారు? తనఖా షేర్లను ఆర్థిక సంస్థలు విక్రయించవచ్చా? ఇలాంటి సంస్థల షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చా ? ఈ అంశాలపై సాక్షి బిజినెస్‌ ప్రత్యేక కథనమిది... 

షేర్ల తనఖా అంటే.... 
లిస్టెడ్‌ కంపెనీలైనా, అన్‌లిస్టెడ్‌ కంపెనీలైనా ప్రతి కంపెనీలో ప్రమోటరుకు కొంత వాటా ఉంటుంది. ఈ వాటాగా ఉండే షేర్లను ప్రమోటర్లు తనఖా పెట్టి రుణం తీసుకుంటారు.  ప్రమోటర్లు నిధులు సమీకరించే విధానాల్లో ఈ తనఖా ఒకటి. కంపెనీ అవసరాల కోసమో, తమ వ్యక్తిగత అవసరాల కోసమో, లేదంటే కంపెనీ విస్తరణ కోసమో.. ప్రమోటర్లు ఈ రుణాలు తీసుకుంటారు. లిస్టెడ్‌ కంపెనీలైతే మార్కెట్‌ ధరకన్నా తక్కువే ఆర్థిక సంస్థలు రుణంగా మంజూరు చేస్తాయి. ఈ సందర్భంగా ప్రమోటరుకు– సదరు ఆర్థిక సంస్థకు మధ్య కుదిరే ఒప్పందంలో... ఒక కటాఫ్‌ ధరను నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఈ షేరు గనక మార్కెట్లో నిర్దేశిత ధరకన్నా తక్కువకు పతనమైతే...  రుణంగా ఇచ్చిన మొత్తాన్ని రాబట్టుకోవటానికి ఆర్థిక సంస్థలు షేర్లను మార్కెట్లో విక్రయించవచ్చనేది ఒప్పందంలోనే ఉంటుంది.  

ఇదే సందర్భంలో ఆర్థిక సంస్థలు గనక ఆ షేర్లను మార్కెట్లో అమ్మకుండా ఉండాలంటే... తీసుకున్న రుణానికి సరిపోయేలా మరిన్ని షేర్లు తనఖా పెట్టాలని (మార్జిన్‌ కాల్‌) ప్రమోటర్‌ను సదరు ఆర్థిక సంస్థ అడుగుతుంది. ఒకవేళ షేర్లు కాకున్నా అప్పటికప్పుడు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రమోటర్‌ విఫలమైనా,  ఈ రుణాలను ప్రమోటర్‌ చెల్లించలేకపోయినా, తనఖా షేర్లను విక్రయించుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. ఇలా రుణదాతలు ఓపెన్‌ మార్కెట్లో షేర్లను తెగనమ్మితే షేర్‌ ధర మరింతగా పతనమవుతుంది. ఒక్కోసారి షేర్ల తనఖా కారణంగా ప్రమోటర్ల వాటా కరిగిపోయి కంపెనీలు చేతులు మారే పరిస్థితులూ రావచ్చు.  

పెరుగుతున్న షేర్ల తనఖా... 
బీఎస్‌ఈలో లిస్టయిన 195 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలో దాదాపు సగానికి పైగా షేర్లను తనఖా పెట్టారని ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. గతేడాది ఒక్క డిసెంబర్‌ క్వార్టర్‌లోనే తనఖా పెట్టిన షేర్ల విలువ రూ.2.50 లక్షల కోట్లకు పెరిగింది. ఇది బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో రెండు శాతం. నిఫ్టీ 50 కంపెనీల్లో అధికంగా తనఖా పెట్టిన షేర్ల కంపెనీల జాబితాలో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఉంది. ప్రమోటర్లు తమకున్న వాటాలో దాదాపు సగానికి పైగా (59.40 శాతం) షేర్లను తనఖా పెట్టారు.


 ప్రమోటర్లు తమ వాటాలో దాదాపు 80% వాటా షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో స్టెరిలైట్‌ టెక్నాలజీస్, రిలయన్స్‌ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, డిష్‌ టీవీ, రిలయన్స్‌ క్యాపిటల్, ఫ్యూచర్‌ కన్సూమర్, ఇండియాబుల్స్‌ రియల్‌  ఎస్టేట్, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లు... ఈ కంపెనీ ప్రమోటర్లు తమ తమ వాటాల్లో 80 శాతానికి పైగా షేర్లను తనఖా పెట్టారని అంచనా. ఇలా అధిక భాగం తనఖాలో ఉన్న ప్రమోటర్ల కంపెనీల షేర్లు గత ఏడాది దాదాపు 80 శాతం వరకూ పతనమయ్యాయంటే తనఖా షేర్ల తీరుకు నిదర్శనం. ఈ జాబితాలో అట్లాంటా, పార్శ్వనాధ్‌ డెవలపర్స్, డీబీ రియల్టీ, ఓమాక్సీ, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ వంటి కంపెనీల షేర్లున్నాయి.

తనఖా షేర్లు కొనచ్చా?
సాధారణంగా ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్లనే కొనుగోలు చేయాలని విశ్లేషకులు సూచిస్తుంటారు. ప్రమోటర్ల షేర్లలో అధిక భాగం తనఖాలో ఉంటే ఇలాంటి కంపెనీల షేర్లకు దూరంగా ఉంటేనే మేలన్నది నిపుణుల సూచన. అయితే కంపెనీ భవిష్యత్తు అంచనాలు బాగా ఉంటే,  షేర్ల తనఖా నిధులతో విస్తరణ చేపడితే అది మంచి అవకాశమేనని వారంటున్నారు. ప్రమోటర్ల షేర్ల తనఖా అంతకంతకూ పెరిగిపోతుంటే కంపెనీ ఫండమెంటల్స్‌పై సందేహాలు రావడం సహజం. 10 శాతం వరకూ షేర్లను తనఖా పెడితే ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. అయితే క్వార్టర్‌ క్వార్టర్‌కు షేర్ల తనఖా పెరిగిపోతే మాత్రం ఆందోళనకరమేనన్నది వారి అభిప్రాయం. మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు షేర్ల తనఖా వార్తలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరుస్తాయనేది బ్రోకరేజ్‌ సంస్థల మాట!!

తనఖాలో టాప్‌...జీఎంఆర్, అపోలో
రాష్ట్రానికి చెందిన మౌలిక సదుపాయాల కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆసుపత్రులు నిర్వహించే అపోలో తనఖా విషయంలో టాప్‌లో ఉన్నాయి. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాలో ప్రమోటర్లకు దాదాపు 63 శాతం వాటా ఉంది. కాకపోతే ఈ వాటాలో ఏకంగా 83 శాతం వరకూ తనఖాలోనే ఉంది. ప్రస్తుతం జీఎంఆర్‌ షేరు ధర రూ.15.50గా ఉండగా... కంపెనీ మార్కెట్‌ విలువ 9,300 కోట్ల వరకూ ఉంది. ఒకదశలో రూ.126 వరకూ వెళ్లిన ఈ షేరు ప్రస్తుతం రూ.15.50కి చేరింది. భారీ రుణ భారంలో కూరుకుపోయిన ఈ కంపెనీ షేరు ధర పతనమవుతున్న కొద్దీ..  ప్రమోటర్లు మరిన్ని షేర్లను తనఖా పెడుతూ వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే రాష్ట్రానికి చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి ప్రమోటర్ల దగ్గర 34 శాతం వాటా ఉండగా... దాన్లో 74 శాతాన్ని తనఖా పెట్టినట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. 


 

మరిన్ని వార్తలు