షేర్ల పతనం- కంపెనీల డీలిస్టింగ్‌ బాట

6 Jun, 2020 11:59 IST|Sakshi

జాబితాలో వేదాంతా, అదానీ పవర్‌

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, యునైటెడ్‌ స్పిరిట్స్‌

కోవిడ్‌-19  కారణంగా రెండు నెలల క్రితం స్టాక్‌ మార్కెట్లు పతనంకావడంతో పలు కంపెనీల షేర్లు చౌక ధరలకు దిగివచ్చాయి. దీంతో కొంతమంది ప్రమోటర్లు కంపెనీలను స్టాక్‌ ఎక్స్ఛేంజేల నుంచి డీలిస్ట్‌ చేసే సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా షేర్ల ధరలు తగ్గినప్పుడు కంపెనీల ప్రమోటర్లు వాటాలను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల కంపెనీలు డీలిస్టింగ్‌ బాట పట్టడంతో ఇన్వెస్టర్లు ఇందుకు అవకాశమున్న కంపెనీలపై దృష్టిసారిస్తున్నట్లు చెబుతున్నారు. బిలియనీర్‌ అనిల్‌ అగర్వాల్‌ గ్రూప్‌ కంపెనీ వేదాంతా ఇప్పటికే డీలిస్టింగ్‌కు సిద్ధంకాగా.. ఇటీవల అదానీ పవర్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సైతం ఇదే బాటలో నడవనున్నట్లు తెలియజేశారు.. పలు కంపెనీల షేర్లు ఇటీవల నేలచూపులతో కదులుతుండటంతో మరింతమంది ప్రమోటర్లు ఈ బాట పట్టవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు రవి సర్ధానా చెబుతున్నారు. తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల కంపెనీ హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ను డీలిస్ట్‌ చేసేందుకు హెచ్‌టీ ఐటీ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తెరతీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక కరోనా వైరస్‌ తలెత్తడంతో స్టాక్‌ మార్కెట్లతోపాటు వేదాంతా షేరు పతనమైంది. 52 వారాల గరిష్టం రూ. 180 నుంచి సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రమోటర్లు వేదాంతా డీలిస్టింగ్‌ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.

2008లో
టెండర్‌ మార్గం ద్వారా ప్రమోటర్లు కంపెనీలలో వాటాలు పెంచుకోవడం లేదా స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్‌ చేయడం వంటి ట్రెండ్‌ ఇంతక్రితం 2000, 2008లో కనిపించినట్లు మార్కెట్‌ వర్గాలు ప్రస్తావిస్తు‍న్నాయి. సాధారణంగా మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు ఇలాంటి ట్రెండ్‌ కనిపిస్తుంటుందని తెలియజేశాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తదుపరి మళ్లీ ఇటీవల ఈ ట్రెండ్‌ వేళ్లూనుకుంటున్నట్లు ఐఐఎఫ్‌ఎల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ నిపుణ్‌ గోయెల్‌ వివరించారు. కాగా.. డీలిస్టింగ్‌ ప్రకటించకముందు వేదాంతా షేరు రూ. 80 స్థాయికి చేరగా.. తదుపరి బలపడి రూ. 105ను తాకింది. అదానీ పవర్‌లో పబ్లిక్‌కు గల 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు గత వారం అదానీ గ్రూప్‌ పేర్కొంది. ఇందుకు రివర్స్‌ బుక్‌బిల్డింగ్‌ పద్ధతిని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఇక లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ను డీలిస్ట్‌ చేసే యోచనలో బ్రిటిష్‌ మాతృ సంస్థ డియాజియో పీఎల్‌సీ ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. నిజానికి డీలిస్టింగ్‌కు ప్రీమియం ధరను చెల్లించవలసి ఉంటుందని, కోవిడ్‌-19 కారణంగా ఇటీవల షేర్ల ధరలు దిగిరావడంతో ఇందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. గతేడాది దేశీ అనుబంధ సంస్థ లిండేను డీలిస్ట్‌ చేసేందుకు యూకే ఇండస్ట్రియల్‌ దిగ్గజం బీవోసీ సైతం ప్రయత్నించిన విషయం ప్రస్తానార్హం. కాగా.. షేరు ఫ్లోర్‌ ధర రూ. 428.5తో పోలిస్తే ఇన్వెస్టర్లు నాలుగు రెట్లు అధికంగా రూ. 2025 ధరను అశించడంతో బీవోసీ వెనక్కి తగ్గిన  విషయం విదితమే.

మరిన్ని వార్తలు