ఆన్‌లైన్‌లోనే ఆస్తి పంపకాలు

6 Dec, 2014 23:35 IST|Sakshi
ఆన్‌లైన్‌లోనే ఆస్తి పంపకాలు

మై ‘విల్’ క్రియేషన్ సర్వీస్ ప్రారంభం

ముంబై: ఆస్తి పంపకాలు కూడా ఇక ఆన్‌లైన్ ద్వారా జరుపుకునే సమయం వచ్చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌బీఐసీటీసీఎల్) ‘ఆన్‌లైన్ విల్ క్రియేషన్’ సేవలను ప్రారంభించింది. ఎటువంటి లోటుపాట్లూ లేకుండా వ్యక్తులు సొంతంగా తమకు తామే విల్లు రాసుకునేందుకు తోడ్పాటును అందించడం ఈ సేవల లక్ష్యమని  కంపెనీ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు అనుబంధంగా (ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్) ఎస్‌బీఐక్యాప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.  ఎస్‌బీఐక్యాప్ బోర్డ్ సభ్యులు, బ్యాంక్ ఎండీ అండ్ జీఈ (అసోసియేట్స్ అండ్ సబ్సిసడరీస్) వీజీ కన్నన్, ఎస్‌బీఐ క్యాప్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ అభయ్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మై విల్ సర్వీసెస్ ఆన్‌లైన్’ పేరుతో అందించే ఈ సేవల ద్వారా వినియోగదారులు ఆరు దశల ప్రక్రియతో తమ విల్లును తామే రూపొందించుకోవచ్చు. తయారీ , సమీక్ష, వివరాల నమోదు, చెల్లింపు, అంశాలను సరిచూసుకోవడం, రిజిస్ట్రేషన్- ఈ ఆరు దశల ప్రక్రియలో ఇమిడి ఉంటాయి.

ఆన్‌లైన్ విల్ క్రియేషన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఈ సేవలను అందించడం జరుగుతుందని, విల్లుకు సంబంధించిన ప్రతి అంశాన్నీ పూర్తి రహస్యంగా ఉంచడం జరుగుతుందని కంపెనీ  వివరించింది. విల్లు తయారీ సమయంలో తగిన సలహాలను అందించడానికి నిరంతరాయంగా పనిచేసే ఒక ‘కంటెంట్ సెంటర్’ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందనీ పేర్కొంది. ఈ సేవలకు వినియోగదారులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ గేట్‌వే చార్జీలు (క్రెడిట్ కార్డ్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ చెల్లింపుల అంశాలు), పన్నులు వంటివి అదనం.

న్యాయ నిపుణుల సలహాలు, విల్లు రిజిస్ట్రేషన్, దీని సురక్షిత నిర్వహణలకు సంబంధించి కూడా వినియోగదారులు అదనపు చెల్లింపులు జరపాలి. నిర్దిష్ట కాలంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా  వినియోగదారుకు వీలుంది. ఎస్‌బీఐ అలాగే ఎస్‌బీఐయేతర కస్టమర్లు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

మరిన్ని వార్తలు