రక్షణాత్మక వాణిజ్యం వృద్ధికి విఘాతం

12 Apr, 2018 00:41 IST|Sakshi

ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టినా లగార్డ్‌  

హాంకాంగ్‌: వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వృద్ధికి విఘాతంగా మారతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టినా లగార్డ్‌ పేర్కొన్నారు. ఇలాంటి విధానాలు విడనాడాలని హెచ్చరించారు. అమెరికా–చైనాల మధ్య ‘వాణిజ్య యుద్ధ’ భయాల నేపథ్యంలో ఆమె ఇక్కడ ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగంలో మరిన్ని ముఖ్యాంశాలు... 
► ప్రపంచ వృద్ధికి స్వేచ్ఛా వాణిజ్య విధానాలే సరైనవి. ఇందుకు విరుద్ధమైన బాటను దేశాలు విడనాడాలి. ఏ రూపంలోనూ వాణిజ్య రక్షణాత్మక విధానాలు అనుసరించకూడదు.  
►తగిన వాణిజ్య విధానాలు లేనందువల్లే వాణిజ్య లోటు ఏర్పడ్డానికి కారణమన్న అభిప్రాయం తప్పు. (అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే ఈ తరహా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.  
►ఒక విషయం గుర్తుంచుకోవాలి. బహుళ వాణిజ్య విధాన వ్యవస్థే ప్రపంచం మార్పునకు కారణం. అత్యంత పేదరికంలో జీవిస్తున్న ప్రజల పేదరికాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అధిక వేతనాలతో లక్షలాది ఉద్యోగాలను ప్రపంచవ్యాప్తంగా సృష్టించడానికి ఈ వ్యవస్థ దోహదపడింది.  
►వ్యవస్థలో లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి తప్ప, దీనిని మొత్తంగానే తప్పుపట్టడం తగదు.  
►కొత్త సాంకేతికత, ఇందుకు సంబంధించి విద్య, శిక్షణల్లో పెట్టుబడుల పెంపుతో వృద్ధిని మరింత పెంపొందించడానికి వీలు కలుగుతుంది. ఇందుకు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి.  
►ప్రపంచ వాణిజ్య వృద్ధి పట్ల మేము పూర్తి ఆశావహంతో ఉన్నాము. 2018, 2019లో 3.9 శాతం వృద్ధి నమోదవుతుందన్నది జనవరిలో ఐఎంఎఫ్‌ వేసిన అంచనా.  
►అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం తాజా వృద్ధి రికవరీ ధోరణి బాగుంది. చైనా, భారత్, జపాన్‌లో కూడా పటిష్ట వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నాం.   

మరిన్ని వార్తలు