ప్రోజోన్‌ ఇంటూ- జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ జోరు

26 May, 2020 11:44 IST|Sakshi

ప్రోజోన్‌కు డీమార్ట్‌ దమానీ దన్ను

5 శాతం జంప్‌చేసిన షేరు

ప్రమోటర్‌ వాటా విక్రయ ఎఫెక్ట్‌

భారతీ ఎయిర్‌టెల్‌ 4.5 శాతం మైనస్‌

హుషారుగా కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లలో విభిన్న వార్తల కారణంగా రియల్టీ రంగ కంపెనీ ప్రోజోన్‌ ఇంటూ ప్రాపర్టీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టగా.. మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రోజోన్‌ ఇంటూ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం..

ప్రోజోన్‌ ఇంటూ ప్రాపర్టీస్‌
రియల్టీ కంపెనీ ప్రోజోన్‌ ఇంటూలో డీమార్ట్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ 1.26 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గతేడాది చివరి క్వార్టర్‌(జనవరి-మార్చి)లో ప్రోజోన్‌కు చెందిన 19.25 లక్షల ఈక్విటీ షేర్లను దమానీ కొనుగోలు చేశారు. కాగా.. ప్రోజోన్‌ ఇంటూలో ఇప్పటికే సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా 2.06 శాతం వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువై కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 18.20 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత ఏడాది కాలంలో ప్రోజోన్‌ ఇంటూ షేరు 39 శాతం క్షీణించగా.. ఈ నెల 7 నుంచీ 70 శాతం దూసుకెళ్లడం విశేషం!

భారతీ ఎయిర్‌టెల్‌
ఓపెన్‌ మార్కెట్లో ప్రమోటర్లు భారతీ టెలికాం.. 2.75 శాతం వాటాను విక్రయించనున్న వార్తల నేపథ్యంలో మొబైల్‌ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.5 శాతం పతనమై రూ. 567 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ముగింపు రూ. 593తో పోలిస్తే 6 శాతం డిస్కౌంట్‌లో ప్రమోటర్లు వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్స్‌ ద్వారా రూ. 558 ధరలో మైనారిటీ వాటాను విక్రయించడం ద్వారా రూ. 7500 కోట్లు(బిలియన్‌ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం 38.79 శాతం వాటాను కలిగి ఉంది. 

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 
ఈ నెలలో ఉత్పాదక సామర్ధ్యాన్ని 85 శాతంవరకూ వినియోగంచుకుంటున్నట్లు వెల్లడించడంతో  ప్రయివేట్‌ రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది.  ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 177 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 87 శాతం క్షీణించి 188 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 22421 కోట్ల నుంచి రూ. 18009 కోట్లకు క్షీణించింది. అయితే ఈ కౌంటర్‌కు విదేశీ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ టార్గెట్‌ ధరను పెంచగా., క్రెడిట్‌ స్వీస్‌ ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ప్రకటించడం గమనార్హం!

మరిన్ని వార్తలు