బ్యాంకు షేర్లు బేర్‌...!

2 Mar, 2018 01:27 IST|Sakshi

 తాజా పతనంతో ఏడాది కనిష్టానికి

పీఎస్‌బీల కష్టాలు ఇంకా ఉన్నాయ్‌..

మూలధన నిధులు ఏ మూలకూ సరిపోవు

మొండి బాకీల కేటాయింపులకే అత్యధికం

రుణాలివ్వాలంటే తగిన నిధులు లేవు

కఠినమవుతున్న ఆర్‌బీఐ నిబంధనలు

కొన్నాళ్లు పీఎస్‌బీ షేర్లకు దూరంగా ఉండాలి

విశ్లేషకులు, మార్కెట్‌ నిపుణుల సూచనలు  

(సాక్షి, బిజినెస్‌ విభాగం) రూ.12,700 కోట్ల రుణ కుంభకోణంతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ ఒక్క నెలలోనే 41 శాతం పతనమైంది. ఒక్కసారిగా అంతా అప్రమత్తం కావటంతో మరిన్ని బ్యాంకుల్లో రుణ కుంభకోణాలు, ఇతర మోసాలు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు సైతం పాతాళానికి పడిపోతున్నాయి. ప్రభుత్వ  బ్యాంక్‌ల కష్టాలు కొనసాగుతాయని హెచ్చరిస్తున్న విశ్లేషకులు ప్రస్తుతం వీటికి దూరంగా ఉండడమే మేలని సూచిస్తున్నారు. వారి విశ్లేషణల సమాహారమే ఈ కథనం...

 రూ.2 లక్షల కోట్ల మేర మూలధన నిధులను సమకూరుస్తామని కేంద్రం చేసిన ప్రకటనతో కెరటాల మాదిరి ఎగసిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు... ఇపుడు ఏడాది కనిష్టానికి పడిపోతున్నాయి.  గత నెలలో అన్ని సూచీల కంటే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అధికంగా... 16.4% నష్టపోయింది.  ఇక ఇదే నెలలో నిఫ్టీ 5 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 7.2%చొప్పున నష్టపోయాయి. రెండేళ్ల క్రితం 2016 జనవరిలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 20 శాతం నష్టపోయింది. ఆ నెలలో నిప్టీ 5 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 7.2% చొప్పున నష్టపోయాయి. 

అసలు కారణం పీఎన్‌బీ!
తాజా పతనానికి పీఎన్‌బీ రూ.12,700 కోట్ల  కుంభకోణమే ప్రధాన కారణం. మొండి బకాయిలు అంతకంతకూ పెరిగిపోతుండడం, రుణ వృద్ధి నానాటికీ తగ్గుతుండడం వంటి ప్రతికూల పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపండులా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.12,700 కోట్ల రుణ కుంభకోణం వెలుగులోకి రావడం బ్యాంక్‌ షేర్ల హవాను మసకబార్చింది. అంతే కాకుండా ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కార్పొరేషన్‌ బ్యాంకుల్లో వెలుగు చూసిన మరిన్ని మోసాలు పరిస్థితులను మరింత దిగజార్చాయి.  షేర్ల పరంగా చూస్తే.., పలు షేర్లు తాజాగా ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. 

బలహీనంగా.. ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు
ప్రభుత్వ రంగ షేర్ల విషయమై సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారిందని నిపుణులంటున్నారు. అందుకని ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు దూరంగా ఉండడమే మంచిదని వారు సూచిస్తున్నారు. వీటికి బదులుగా ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని వారు చెప్పారు. ఇప్పుడు మార్కెట్లో అత్యంత బలహీనంగా ఉన్న షేర్లంటే ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లేనని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌(వెల్త్‌) జగన్నా«థమ్‌ తూనుగుంట్ల వ్యాఖ్యానించారు. బ్యాంక్‌లకు సంబంధించి ప్రతికూల వార్తలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉన్నాయని, దీంతో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్సూరెన్స్‌) సెగ్మెంట్లో ఇతర సురక్షిత కంపెనీల వైపు ఇన్వెస్టర్లు తరలిపోతున్నారని వివరించారు. 

పీఎన్‌బీ పతనమే అధికం...
గత నెల ఆరంభంలో రూ.172 వద్ద ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ నెల రోజుల తర్వాత 41 శాతం పతనమై రూ.101కు పడిపోయింది. ఇది 20 నెలల కనిష్ట స్థాయి. ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌(పీసీఏ) ప్లాన్‌ కింద ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌ను కూడా చేర్చే అవకాశాలు అధికంగా ఉండటంతో రేటింగ్‌ను తగ్గిస్తున్నామని బీఎన్‌పీ పారిబా పేర్కొంది.  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో సహా మొత్తం 11 పీఎస్‌బీలు ఇప్పుడు ఈ పీసీఏ పరిధిలో ఉన్నాయి.  పీసీఏ పరిధిలో ఉన్న బ్యాంక్‌లు భారీ స్థాయి రుణాలివ్వడానికి వీలుండదు. ఫలితంగా ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందని నిపుణులంటున్నారు. మొత్తం దేశం రుణావసరాలను 70 శాతం వరకూ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లే తీరుస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధి ఏ తీరుగా ప్రభావితమవుతుందో అన్న ఆందోళన అందరిలో నెలకొన్నది.  బ్యాంక్‌ రుణ కుంభకోణాలు,మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరం సరైన చర్యలు తీసుకోకుంటే  పెద్ద నష్టమే జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరునెలల్లో మరిన్ని మొండి బకాయిలు...
మరోవైపు ఆర్‌బీఐ ‘ఒత్తిడి రుణాల’కు సంబంధించిన నియమ నిబంధనల్లో మార్పులు తెచ్చింది. రుణ పునర్వ్యస్థీకరణ ప్రణాళికలకు సంబంధించిన కొన్ని విధానాలను రద్దు చేసింది. రుణ ఎగవేతలను తక్షణం గుర్తించాలని, సంబంధించిన వివరాలను ప్రతి శుక్రవారం ఆర్‌బీఐ క్రెడిట్‌ రిజిస్ట్రీలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రుణ పునర్వ్యస్థీకరణ ప్రణాళికల రద్దు కారణంగా మరో 2.8 లక్షల కోట్ల రుణాలు తాజాగా మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని అంచనా. అయితే ఆర్‌బీఐ తాజా నిబంధనల వల్ల రుణ ఎగవేతలను త్వరగానే గుర్తించే వీలు కలుగుతుందని, సకాలంలో సత్వర చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని నిపుణులంటున్నారు. దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది సానుకూలమైన చర్యేనని కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది. అయితే రానున్న ఆరు నెలల్లో మొండి బకాయిల స్థాయిలు మరింతగా ఎగిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

మూలధన నిధులు ఏ మూలకు?
ప్రభుత్వం అందించనున్న రూ.2 లక్షల కోట్ల మూలధన నిధులతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల దశ తిరిగిపోతుందని అంతా భావించారు. ఈ ప్రణాళికను వెల్లడించినప్పటి నుంచి బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి కూడా. అయితే తాజాగా వెలుగులోకి వస్తున్న మోసాల వరుస చూస్తుంటే, ఈ మూల ధన నిధులు భవిష్యత్తు వృద్ధికి కాకుండా ప్రస్తుతం భారీగా పెరిగిపోతున్న మొండి బకాయిలకు, నష్టాలకు కేటాయింపులకు కూడా సరిపోయేటట్టు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. ఉదాహరణకు పీఎన్‌బీకు ప్రభుత్వం రూ.5,700 కోట్లు మూలధన నిధులు ఇవ్వనుంది. పీఎన్‌బీ రుణ కుంభకోణం దీనికి రెట్టింపునకు పైగా రూ.12,700 కోట్ల మేర ఉండటం గమనార్హం. 
 

మరిన్ని వార్తలు