బ్యాం'కింగ్ బుల్!

26 Oct, 2017 00:09 IST|Sakshi

సూచీల శివతాండవం

పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌ బంపర్‌ ర్యాలీ

రూ. 2.11 లక్షల కోట్ల ప్రభుత్వ మూలధన ప్రకటన ప్రభావం

నూతన గరిష్టాల వద్ద సూచీల ముగింపు ∙ తొలిసారిగా 33,000 మార్కుపైకి సెన్సెక్స్‌ 435 పాయింట్ల లాభం ∙ 10295కు నిఫ్టీ... 87 పాయింట్లు పైకి భారత్‌ మాలా ప్రకటనతో ఇన్‌ఫ్రా స్టాక్స్‌ జోరు  ∙ భారీగా షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లకు క్యూ కట్టిన ఎఫ్‌ఐఐలు ∙ ఒకేరోజు రూ.3,582 కోట్ల మేర పెట్టుబడులు  

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో బుధవారం (2017 అక్టోబర్‌ 25) బ్యాంకు స్టాక్స్‌ మెరుపులు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. కేంద్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం చేసిన ఓ ప్రకటన ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకు స్టాక్స్‌ భారీ ర్యాలీకి దోహదం చేసింది. రూ.2.11 లక్షల కోట్లకుపైగా పీఎస్‌యూ బ్యాంకులకు మూలధన సాయం చేయనున్నట్టు, బ్యాంకింగ్‌ రంగంలో మరిన్ని సంస్కరణలకు తెరతీయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనతో పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్‌ రెచ్చిపోయాయి. బుధవారం సెషన్‌ అంతా బ్యాంకు స్టాక్స్‌ మెరుపులతోనే కొనసాగింది. చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 46 శాతం వరకు ఒక్కరోజులోనే లాభాలను మూటగట్టుకున్నాయి.

ఉదయం 9.15 గంటలు. నిఫ్టీ 10321.15 వద్ద ప్రారంభం. క్రితం ముగింపు 10208తో పోలిస్తే ఏకంగా 113 పాయింట్లు అధికం. ఎస్‌బీఐ మంగళవారం 254.45 వద్ద ముగియగా.... సుమారు 10 శాతం ప్లస్‌తో రూ.279.85 వద్ద ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభం అయింది. చివరికి 27 శాతం లాభపడి రూ.324.90 వద్ద క్లోజయింది. సెన్సెక్స్‌ 30 స్టాక్స్‌లో భారీగా పెరిగింది ఇదొక్కటే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఏకంగా 46% లాభపడి ఒకే రోజు రూ.63.80 పెరుగుదలతో రూ.201.90 వద్ద బీఎస్‌ఈలో ముగిసింది. ఈ స్టాక్‌ మంగళవారం ముగింపు రూ.138.10. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 31.47% పెరిగింది. క్రితం ముగింపు రూ.143.15తో పోలిస్తే రూ.45 లాభంతో బీఎస్‌ఈలో రూ.188.20 వద్ద క్లోజయింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం 34 శాతం లాభపడింది. ఇంకా ఇండియన్‌ బ్యాంకు 21.48 శాతం, ఐడీబీఐ బ్యాంకు 20%, ఆంధ్రా బ్యాంకు 19%, అలహాబాద్, సిండికేట్‌ బ్యాంకులు 17% వరకు పెరిగాయి. వీటితోపాటు కెనరా బ్యాంకు, బ్యాంకాఫ్‌ మహారాష్ట్ర సైతం లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఒకేరోజు 29 శాతానికి పైగా లాభపడడం కూడా రికార్డే. బ్యాంకు స్టాక్స్‌కు తోడు సాగర్‌మాల ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి రూ.6.92 లక్షల కోట్లను ఖర్చు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించడంతో ఇన్‌ఫ్రా రంగ స్టాక్స్‌ కూడా భారీగా లాభపడ్డాయి. దీంతో దేశీయ స్టాక్‌ సూచీలు నూతన జీవితకాల గరిష్ట స్థాయిలకు పరుగులు తీశాయి.

నూతన శిఖరాలకు...
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1.33 శాతం వృద్ధితో క్రితం ముగింపుతో పోలిస్తే 435.16 పాయింట్లు లాభపడి 33,042.50 వద్ద క్లోజయింది. ఈ ఏడాది మే 25 తర్వాత ఒక సెషన్‌లో సెన్సెక్స్‌ భారీగా లాభపడడం మళ్లీ ఇదే. ఇంట్రాడేలో 33,117.33 గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ స్థాయిల్లో లాభాల స్వీకరణతో సూచీలు కొంత దిగొచ్చాయి. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87.65 పాయింట్లు పెరిగి నూతన జీవితకాల గరిష్ట స్థాయి 10,295.35 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి 10,340.55ని నమోదు చేసింది. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ భారీగా పెరగడం, అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఎఫ్‌అండ్‌వో పొజిషన్ల కాలపరిమితి గురువారంతో క్లోజింగ్‌ కానుండడంతో భారీగా షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకుంది. ఇది సూచీలకు సానుకూలంగా మారింది. సూచీలో ప్రభుత్వరంగ ఎస్‌బీఐ 27.58 శాతం, ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంకు 14.69%, యాక్సిస్‌ బ్యాంకు 4.61% పెరిగాయి. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ఉండడం, క్యూ2లో బ్లూచిప్‌ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండడం, ఎఫ్‌ఐఐలు ఒకేరోజు ఏకంగా రూ.3,582 కోట్ల మేర కొనుగోళ్లు జరపడం భారీ లాభాలకు తోడ్పడింది. గత రెండు నెలల కాలంలో ఎఫ్‌ఐఐలు నికరంగా అమ్మకాల వైపు ఉండగా, బుధవారం ఒక్కరోజే ఈ స్థాయిలో కొనుగోళ్లు చేయడం రికార్డు. సూచీల పరంగా చూస్తే పీఎస్‌యూ 8 శాతం, బ్యాంకెక్స్‌ 5 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 3.33 శాతం, ఇన్‌ఫ్రా 2.33 శాతం వరకు పెరిగాయి. ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్, విప్రో, ఐటీసీ, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, రిలయన్స్, ఓఎన్‌జీసీ, హీరో మోటో స్వల్పంగా లాభపడ్డాయి. సూచీ వెలుపల ఇన్‌ఫ్రా స్టాక్స్‌లో అశోక బిల్డ్‌కాన్, సద్బావ్‌ ఇన్‌ఫ్రా, జేకుమార్‌ ఇన్‌ఫ్రా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 9 శాతం వరకూ పెరిగాయి. 

మరిన్ని వార్తలు