బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 52 శాతానికి

15 Jan, 2019 04:42 IST|Sakshi

క్రమంగా తగ్గించుకోనున్న కేంద్రం

న్యూఢిల్లీ: మెరుగైన కార్పొరేట్‌ విధానాల్లో భాగంగా... ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను 52 శాతానికి పరిమితం చేసుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రభుత్వం సహజంగానే వాటాదారు. అయితే, ఇది మెరుగైన కార్పొరేట్‌ విధానాలకు అనుగుణంగా ఉండాలి. ప్రభుత్వం వాటా ముందుగా కనీసం 52 శాతానికి తగ్గాలి. మార్కెట్‌ పరిస్థితులు అనుకూలంగా ఉన్న సమయంలో బ్యాంకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయి. అందుకు సంబంధించి వారికి పూర్తి అనుమతులు ఇచ్చాం’’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తెలిపారు.

ప్రభుత్వ వాటా తగ్గింపుతో సెబీ ‘కనీస ప్రజల వాటా’ నిబంధనలను పాటించేందుకు వీలవుతుందన్నారు. తగిన జాగ్రత్తలతో బ్యాంకులు రుణాలు మంజూరు చేసేందుకు ఇది ప్రోత్సహిస్తుందన్నారు. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేంద్రానికి 75%కి పైగా వాటా ఉండటం గమనార్హం. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల వాటా కనీసం 25% ఉండాలి.  ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ ఇప్పటికే క్యూఐపీ ద్వారా రూ.20,000 కోట్ల మేర షేర్ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఇది పూర్తయితే ప్రభుత్వం వాటా ప్రస్తుతమున్న 58.53% నుంచి తగ్గుతుంది. సిండికేట్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంకులు ఇప్పటికే ఉద్యోగులకు షేర్ల అమ్మకం ద్వారా నిధుల సమీకరణ చర్యలను చేపట్టాయి. దీని ద్వారా కూడా ప్రభుత్వం వాటా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు