నిధుల సేకరణలో పీఎస్‌యూ బ్యాంకులు

7 Aug, 2017 00:29 IST|Sakshi
నిధుల సేకరణలో పీఎస్‌యూ బ్యాంకులు

12 బ్యాంకుల ప్రణాళిక ∙వీటికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇంద్రధనుష్‌ రోడ్‌మ్యాప్‌ ప్రకారం బాసెల్‌–3 నిబంధనల మేరకు 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ల నుంచి వివిధ రూపాల్లో రూ.1.10 లక్షల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి రూ.70,000 కోట్ల సాయం అందనుంది. ఇందులో రూ.50,000 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం
గమనార్హం.  

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులు నిధుల వేటలో పడ్డాయి. 12 బ్యాంకులు మార్కెట్ల నుంచి నిధులు సమీకరించనున్నాయి. వీటిలో పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకు కూడా ఉన్నాయి. బాసెల్‌–3 మూలధన అవసరాలను చేరుకునేందుకు బ్యాంకులకు నిధుల అవసరం ఉంది. ఆంధ్రా బ్యాంకు సహా మొత్తం మీద ఆరు నుంచి ఏడు పీఎస్‌యూ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధుల సమీకరణను పూర్తి చేయనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో), అర్హత గల సంస్థాగత మదుపరులకు షేర్ల కేటాయింపు
(క్యూఐపీ) ద్వారా నిధులు సమీకరించనున్నట్టు వెల్లడించాయి.

పలు అవకాశాలు...
అలహాబాద్‌ బ్యాంకు,ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, దేనా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులు క్యూఐపీ లేదా ఎఫ్‌పీవో లేదా ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ విధానంలో నిధులు సేకరించేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కూడా పొందాయి. సిండికేట్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, యునైటెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, విజయా బ్యాంకులకు సైతం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అలçహాబాద్‌ బ్యాంకు రూ.2,000 కోట్ల నిధుల సమీకరణకు వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. పీఎన్‌బీ బోర్డు రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు అంగీకారం తెలిపింది. దేనా బ్యాంకు రూ.1,800 కోట్ల సమీకరణకూ వాటాదారులు ఆమోదం తెలియజేశారు. ఎస్‌బీఐ క్యూఐపీ ద్వారా రూ.15,000 కోట్ల సమీకరణను ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు