15 పీఎస్యూల మూసివేతకు ప్రభుత్వం సిద్ధం!

29 Sep, 2016 03:48 IST|Sakshi
సౌత్ బ్లాక్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశం నుంచి వస్తున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ

భారత్ పంప్స్‌లో మెజారిటీ వాటాల విక్రయం
కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర

 నష్టాల్లో నడుస్తున్న 15 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని సమాచారం. మొత్తం 74 ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న పీఎస్‌యూల భవితవ్యంపై నీతి ఆయోగ్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) ఈ మేరకు నిర ్ణయం తీసుకుందని ఉన్నతాధికారొకరు చెప్పారు. ప్రధాన మంత్రి ప్రధాన సలహాదారు నృపేంద్ర మిశ్రా ఆధ్వర్యంలో వివిధ దఫాలుగా జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం జరిగిందని ఆ అధికారి వివరించారు.

కనీసం ఐదు పీఎస్‌యూలను మూసేయాలని, మూడు పీఎస్‌యూల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. మరో ఆరు ఖాయిలా పీఎస్‌యూలను నీతి ఆయోగ్ గుర్తించిందని, అయితే వీటిని మూసేయకుండా మంత్రులు లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ మూసివేతను పెట్రోలియమ్ మంత్రిత్వ శాఖ వ్యతిరేకిస్తోంది. ఇక బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్, ఎల్జిన్ మిల్స్‌లను మూసేయడాన్ని టెక్స్‌టైల్స్ శాఖ వ్యతిరేకిస్తోంది.

హెచ్‌ఎంటీ విభాగాలను మూసేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది మొదట్లోనే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. హెచ్‌ఎంటీ వాచెస్ సంస్థలోని ఉద్యోగులకు 2007 నాటి స్కేళ్ల ప్రకారం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్)ను ఆఫర్ చేస్తున్నారు. కాగా  సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను మూసేయించాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు ఫలించాయి. సెంట్రల్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను మూసేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

మూడు ఫార్మా పీఎస్‌యూలను మూసివేయాలని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఈ మూడు ఫార్మా పీఎస్‌యూలపై నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల సంఘానికి నివేదించారు. మూసేయాల్సిన ఖాయిలా పడ్డ పీఎస్‌యూల్లో హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ కూడా ఉంది. పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీకి ముంబై, ఢిల్లీల్లో వందల ఎకరాల భూములున్నాయి.

ఖాయిలా పడిన, నష్టాల్లో ఉన్న 74 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయమై ప్రభుత్వం ఎలాంటి విధానాలను అనుసరించాలో సూచిస్తూ నీతి ఆయోగ్ ఒక నివేదికను ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాన మంత్రి ప్రధాన సలహాదారు నృపేంద్ర మిశ్రాకు  సమర్పించింది.  ఆస్తుల విక్రయం ద్వారా పీఎస్‌యూలను మూసేయడం, వీటి యాజమాన్యాన్ని రాష్ట్రప్రభుత్వాలకు బదిలీ చేయడం, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే సంస్థలను పునరుద్ధరించడం ఈ పాలసీలోని కొన్ని అం శాలు.రెండింటిపై యథాతథ స్థితిని కొనసాగిం చాలని, పది పీఎస్‌యూల్లో వ్యూహాత్మకంగా వాటా  విక్రయించాలని. 22 పీఎస్‌యూలను పునరుద్ధరించాలని, ఆరు పీఎస్‌యూల్లో యాజమాన్యాన్ని బదిలీ, మూడింటిని విలీనం చేయాలని,  ఐదింటిని దీర్ఘకాలం పాటు లీజ్‌కు ఇవ్వాలని, 26 పీఎస్‌యూలను మూసేయాలని.. నీతి ఆయోగ్ సూచించింది.

న్యూఢిల్లీ: భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్‌లో మెజారిటీ వాటా (వ్యూహాత్మక)ల విక్రయానికి కేంద్ర క్యాబినెట్  బుధవారం సూత్రప్రాయ ఆమోదముద్ర వేసింది. అలహాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ (సీపీఎస్‌ఈ)లో 50% వరకూ లేదా ఆ పైన వాటాల విక్రయమే వ్యూహాత్మక వాటాల విక్రయంగా పరిగణిస్తారు. ఈ అమ్మకంలో యాజమాన్య నియంత్రణ కూడా బదిలీ అవుతుంది. భారత్ పంప్స్ అండ్ కంప్రెషర్స్ లిమిటెడ్‌కు రూ.111.59 కోట్ల  రుణ ప్రణాళికేతర ఆర్థిక సహాయాన్నీ అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది.  తద్వారా రిటైర్డ్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీసహా సీఐఎస్‌ఎఫ్ బకాయిల చెల్లింపులే ఈ ప్రణాళిక లక్ష్యం. 

 రష్యా చమురు క్షేత్రాల్లో వాటాల కొనుగోలు
కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఆయిల్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ల కన్సార్షియం రెండు రష్యన్ చమురు క్షేత్రాల్లో  వాటాల కొనుగోలుకూ  క్యాబినెట్ ఓకే చెప్పింది. ఈ విలువ మొత్తం 3.14 బిలియన్ డాలర్లు. దీనిప్రకారం ఇండియన్ ఆయిల్, ఆయిల్ ఇండియా, బీపీసీఎల్‌లు తూర్పు టాస్-యూరియాక్ చమురు క్షేత్రాల్లో 29.9 శాతం వాటాలను కొనుగోలు చేస్తాయి. ఈ వాటాల విలువ 1.12 బిలియన్ డాలర్లు. 2.02 బిలియన్ డాలర్లతో వాకోర్ చమురు క్షేత్రాల్లో 23.9 శాతం వాటాలను కొంటాయి.

 హిందుస్తాన్ కేబుల్స్ క్లోజర్ ప్యాకేజీ
క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ కేబుల్స్ మూసివేతకు సంబంధించిన నిర్ణయం ఒకటి. ఇందుకు సంబంధించి 4,777.05 కోట్ల ప్యాకేజీకి కేంద్రం ఆమోదం తెలిపింది.  వేతనాల చెల్లింపు, ముందస్తు రిటైర్ స్కీమ్‌లు, ప్రభుత్వ రుణాన్ని ఈక్విటీగా మార్పు వంటి అవసరాలకు ఈ ప్యాకేజీని వినియోగిస్తారు.

దివాళా వ్యవహారాల కోసం కార్పొరేషన్!
ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరర్ల దివాళా వ్యవహారాలను శీఘ్రంగా పరిష్కరించేందుకు వీలుగా ఓ ‘రిజల్యూషన్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన కమిటీ సూచించింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థపైనే ఉండాలని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు