2019లోనూ కేంద్రానికి భారీగా నిధులు!

2 Jan, 2019 00:56 IST|Sakshi

ఎయిర్‌ ఇండియా వాటాల అమ్మకమే తరువాయి

 2018లో ప్రభుత్వ కంపెనీల్లో వాటాల అమ్మకంతో రూ.77,417 కోట్లు

కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయం ద్వారా రూ.77,417 కోట్లను సమీకరించింది. ఇక 2019లోనూ ఎయిర్‌ ఇండియాలో వాటాలను ఎలాగైనా విక్రయించాలన్న లక్ష్యంతో ఉంది. దీంతో ఈ ఏడాది కూడా కేంద్రానికి గణనీయంగానే నిధులు సమకూరనున్నాయి. గతానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ కంపెనీల మధ్య విలీనాల ద్వారా తన నిధుల అవసరాలను తీర్చుకునే ప్రణాళికలను అమలు చేస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఓఎన్‌జీసీ ఇదే విధంగా హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసింది. దీంతో హెచ్‌పీసీఎల్‌లో కేంద్రం తనకున్న వాటాను ఓఎన్‌జీసీకి విక్రయించడం ద్వారా గణనీయంగానే నిధులు సమకూరాయి.

సీపీఎస్‌ఈ ఈటీఎఫ్, భారత్‌ 22ఈటీఎఫ్, కోల్‌ ఇండియాలో వాటాల అమ్మకం, ఆరు ప్రభుత్వరంగ సంస్థల ఐపీవోల ద్వారా కేంద్రానికి గత సంవత్సరంలో 77,417 కోట్ల నిధులు అందుబాటులోకి వచ్చాయి.  2019 అమ్మకాలు: ఎయిర్‌ ఇండియాలో వాటాలను కేంద్రం గతేడాది అమ్మకానికి పెట్టినప్పటికీ... ఏ ప్రైవేటు సంస్థ కూడా ముందుకు రాలేదు. ఎయిర్‌ఇండియాకు రూ.55వేల కోట్ల వరకూ రుణాలు ఉండటంతోపాటు కార్యకలాపాలపై పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్న విషయం గమనార్హం. దీంతో ఎయిర్‌ ఇండియా అమ్మకానికి ముందు ఆ సంస్థను గాడిలో పెట్టే చర్యలను కేంద్రం అమల్లో పెట్టింది. తన ప్రణాళికలో భాగంగా ఎయిర్‌ ఇండియా సబ్సిడరీలు ఎయిర్‌ ఇండియా ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్, ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్, భవనాలు, ఖాళీ స్థలాలను విక్రయించనుంది.

దీని ద్వారా రూ.29,000 కోట్ల వరకు రుణ భారం తగ్గించనుంది. ఎయిర్‌ ఇండియా లాభాల్లోకి వచ్చేందుకు గాను నిధుల సాయం కూడా చేయనుంది. ఇక 2019లో పవన్‌ హన్స్‌లో తనకున్న 51 శాతం వాటాను కేంద్రం విక్రయించనుంది. మిగిలిన 49 శాతం వాటా ఓఎన్‌జీసీకి ఉంది. ఇక ఓఎన్‌జీసీ, ఐవోసీఎల్, ఆయిల్‌ ఇండియా, ఎన్‌ఎల్‌సీ, బీహెచ్‌ఈఎల్‌  తదితర కంపెనీల షేర్ల బైబ్యాక్‌ల ద్వారా కేంద్రానికి రూ.12,000 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఆర్‌ఈసీలో కేంద్రం వాటాలను పీఎఫ్‌సీ కొనుగోలు చేయడం ద్వారా మరో రూ.15,000 కోట్లు సమకూరతాయి. ఎస్‌జేవీఎన్‌లో కేంద్రం వాటాను ఎన్‌టీపీసీ కొనడం ద్వారా రూ.6,000 కోట్లు రానున్నాయి.    

మరిన్ని వార్తలు