ప్రభుత్వ బ్యాంకులకు మొండి బకాయిల భారం

10 Feb, 2016 01:20 IST|Sakshi

♦ రూ. 51 కోట్లకు తగ్గిన పీఎన్‌బీ లాభం 
♦ దేనా, ఆలహాబాద్ బ్యాంక్‌లకు భారీ నష్టం

న్యూఢిల్లీ/ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బకాయిలు గుదిబండలా మారుతున్నాయి. మొండి బకాయిల కేటాయింపుల కారణంగా ఈ బ్యాంకుల నికర లాభాల్లో భారీగా కోత పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి సంబంధించి మంగళవారం ఆర్థిక ఫలితాలు ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్, దేనా బ్యాంక్, అలహాబాద్ బ్యాంకుల నికర లాభాలపై మొండి బకాయిలు  విశ్వరూపం చూపించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 93 శాతం క్షీణించగా, దేనా బ్యాంక్‌కు రూ.663 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.486 కోట్ల చొప్పున నికర నష్టాలు వచ్చాయి. వివరాలు...

 దేనాబ్యాంక్‌కు 663 కోట్ల నష్టం
దేనా బ్యాంక్‌కు డిసెంబర్ క్వార్టర్‌లో రూ.663 కోట్ల నష్టం వచ్చింది. మొండి బకాయిలు భారీగా పెరగడమే దీనికి  ప్రధాన కారణమని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.77 కోట్ల నికర లాభం ఆర్జించామని వివరించింది. గత క్యూ3లో రూ.2,867కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.2,722 కోట్లకు తగ్గిందని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 5.61 శాతం నుంచి9.85 శాతానికి పెరిగినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

 93% తగ్గిన పీఎన్‌బీ నికర లాభం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభంపై మొండి బకాయిలకు కేటాయింపులు తీవ్రమైన ప్రభావం చూపాయి.  గత క్యూ3లో రూ.775 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 93 శాతం క్షీణించి రూ.51 కోట్లకు పడిపోయిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) తెలిపింది.  మొత్తం ఆదాయం మాత్రం రూ.12,905 కోట్లనుంచి 8 శాతం వృద్ధితో రూ.13,891 కోట్లకు పెరిగిందని  పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉషా అనంతసుబ్రహ్మణ్యన్ చెప్పారు  ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం రూ.4,120 కోట్లు, వడ్డీయేతర ఆదాయం రూ.1,671 కోట్లు చొప్పున ఆర్జించామని చెప్పారు. పరిశ్రమ తీవ్రమైన కష్టాల్లో ఉందని, రుణాలు అధికంగా ఇచ్చే బ్యాంకుల్లో ఒకటైనందున తమ బ్యాంక్‌పై తీవ్రమైన ప్రభావం పడిందని. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా  ఉషా మాట్లాడారు.

 అలహాబాద్ బ్యాంక్...
అధిక కేటాయింపుల ఫలితం అలహాబాద్ బ్యాంక్‌కు  3వ త్రైమాసికలో రూ.486 కోట్ల నికర నష్టం వచ్చింది. మొండి బకాయిలకు భారీ కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని  బ్యాంక్ తెలిపింది. గత క్యూ3లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,387 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.5,030కు తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 5.46 శాతం నుంచి 6.40 శాతానికి ఎగశాయి.

>
మరిన్ని వార్తలు