‘రుణ’ ఫలాలు అందరికీ అందాలి

21 Aug, 2018 01:12 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అభిప్రాయం

జీడీపీలో ‘రుణ’ నిష్పత్తి పెరిగాలి

ముంబై: సమాజంలోని అన్ని వర్గాలకూ సకాలంలో తగిన రుణ లభ్యత అవసరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ వీ ఆచార్య స్పష్టం చేశారు. ఈ దిశలో దోహదపడే విధంగా ‘‘పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ’’ (పీసీఆర్‌) పేరుతో ఒక ప్రత్యేక చట్టం అవసరమని కూడా ఆయన ప్రతిపాదించారు.  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రుణ నిష్పత్తి పెరుగుదల ప్రాధాన్యతను విశ్లేషించారు. ఫలప్రదమయ్యే రీతిన వ్యవస్థీకృతంగా  సమాజంలోని అన్ని వర్గాలకూ తగిన, సకాలంలో రుణ లభ్యత వల్ల బ్యాంకింగ్‌ మొండి బకాయిలు తగ్గడమే కాకుండా, దేశ ఆర్థిక అభివృద్ధీ సాధ్యమవుతుందని అన్నారు.

ఫైనాన్షియల్‌ వ్యవస్థలో అసమానత్వ సమస్య పరిష్కారమూ జరుగుతుందన్నారు.  రుణ గ్రహీతల చరిత్ర మొత్తాన్ని బ్యాంకింగ్‌ పొందగలుగుతుందని అన్నారు.  ఫిక్కీ–ఐబీఏ సోమవారం ఇక్కడ నిర్వహించిన జాతీయ బ్యాంకింగ్‌ సదస్సులో స్కైప్‌ కాల్‌ ద్వారా డిప్యూటీ గవర్నర్‌ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...భారత్‌లో క్రెడిట్‌ టూ జీడీపీ రేషియో (స్థూల దేశీయోత్పత్తిలో రుణ వాటా) 55.7 శాతం మాత్రమే. ఆర్థిక అవకాశాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్‌నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) 2017 నాల్గవ త్రైమాసిక గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 

చైనా విషయంలో ఈ నిష్పత్తి 208.7 శాతం. బ్రిటన్‌లో 170.5 శాతం. అమెరికాలో 152.2 శాతం. నార్వేలో అత్యధికంగా 245.6 శాతంగా ఉంది.  బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు,  మార్కెట్ల నుంచి కార్పొరేట్‌ బాండ్లు లేదా డెబెంచర్లు, విదేశీ వాణిజ్య రుణాలు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్, మసాలా బాండ్స్, ఇంటర్‌ కార్పొరేట్‌ రుణాలు ఇలా ఎన్నో మార్గాల ద్వారా రుణాలను పొందడం జరుగుతోంది. అయితే ఈ సమాచారం అంతా పొందడానికి ఏకైన డేటా కేంద్రం ఏదీ లేదు. ఈ లోటును పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ తీరుస్తుంది.


కన్సార్షియం లెండింగ్‌ తగ్గాలి: ఎస్‌బీఐ చైర్మన్‌
కన్సార్షియం లెండింగ్‌పై (కొన్ని బ్యాంకులు కలసి ఉమ్మడిగా జారీ చేసే రుణం) ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ ఫిక్కీ–ఐబీఏ సదస్సులో అభిప్రాయపడ్డారు. దీనిపై ఎక్కువగా ఆధారపడడం ఎన్‌పీఏలు పెరిగేందుకు దారితీసిందని, రుణ మదింపుల జాప్యానికి కారణమైందని చెప్పారాయన.  చిన్న రుణాలకు ఎక్కువ బ్యాంకులు జతకట్టడం అర్థవంతం కాబోదన్న ఆయన, కన్సార్షియం సైజును పరిమితం చేయాల్సి ఉందన్నారు. రూ.500 కోట్ల రుణం వరకూ ఎస్‌బీఐ మరో బ్యాంకుతో జతకట్టబోదని (కన్సార్షియం) రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు