బ్యాంకు చార్జీల బాదుడు!! 

1 Aug, 2018 00:58 IST|Sakshi

నాలుగేళ్లలో రూ. 3,300 కోట్లు 

వసూలు చేసిన పీఎస్‌బీలు 

న్యూఢిల్లీ: వివిధ చార్జీల రూపంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) గడిచిన నాలుగేళ్లలో ఖాతాదారుల నుంచి ఏకంగా రూ. 3,324 కోట్లు వసూలు చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా మంగళవారం రాజ్యసభకు  ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. బ్యాంకులు అందించే వివిధ సేవలకు నిర్దిష్ట చార్జీలు వసూలు చేసుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అనుమతి ఉందని, ఈ చార్జీలు సహేతుకమైన స్థాయిలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి జన ధన యోజన సహా పలు ప్రాథమిక బ్యాంకింగ్‌ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని మంత్రి తెలిపారు. 2017 డిసెంబర్‌ ఆఖరు నాటికి 30.84 కోట్ల జన ధన అకౌంట్లు సహా మొత్తం.. 53.3 కోట్ల బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ ఖాతాలు ఉన్నాయని వివరించారు. మినిమం బ్యాలెన్స్‌ లేకపోయినా వీటిపై ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు