అంతా వాళ్లే చేశారు..!

17 Oct, 2019 04:14 IST|Sakshi
కొలంబియా వర్సిటీలో మాట్లాడుతున్న సీతారామన్‌

మన్మోహన్, రాజన్‌ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులకు దుర్గతి

వాటిని బాగుచేయడమే నా ప్రాథమిక కర్తవ్యం

ఆర్థిక మంత్రినిర్మలా సీతారామన్‌  

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ పబ్లిక్‌ అఫైర్స్‌లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్‌ 4 నుంచి 2016 సెప్టెంబర్‌ 4 వరకు ఆర్‌బీఐ గవర్నర్‌గా, 2012 ఆగస్ట్‌ 10 నుంచి 2013లో ఆర్‌బీఐ గవర్నర్‌ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్‌రాజన్‌ పనిచేశారు.

గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్‌ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇటీవల బ్రౌన్‌ యూనివర్సిటీలో రాజన్‌ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు  సీతారామన్‌ గట్టిగానే బదులిచ్చారు.  

ఫోన్‌ కాల్స్‌తో రుణాలు
‘‘ఆర్‌బీఐ గవర్నర్‌గా రాజన్‌ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్‌సింగ్‌) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్‌ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే.

ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. రాజన్‌ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్‌పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు