మొండి బండ.. మరింత భారం!

27 Jun, 2019 04:37 IST|Sakshi

మూలధన నిధుల కేటాయింపులన్నీ వీటికే...

బ్యాంక్‌ లాభాలపైనా తీవ్ర ప్రభావం 

దివాలా చట్టం ఊరట అంతంతే

ప్రైవేట్‌ బ్యాంక్‌లకూ పెరుగుతున్న సమస్య  

మొండి బకాయిలు... ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సమస్య తీవ్రత తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవేవీ ఫలించడం లేదు.  ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రమవుతోంది.  ఈ సమస్య కారణంగానే గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నిర్వహణ నష్టాలు రూ.50,000 కోట్లకు మించాయి. అంతే కాకుండా  భారీ కంపెనీల కొన్ని బకాయిలు మొండిగా మారే ప్రమాదమూ పొంచి ఉంది. మార్చి క్వార్టర్‌ చివరినాటికి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల స్థూల మొండి బకాయిలు రూ.7.7 లక్షల కోట్లకు తగ్గింది. అయితే ఇది ఏమంత ఊరటనిచ్చే విషయం కాదని నిపుణులంటున్నారు.  

దివాలా ప్రక్రియ మంచిదే కానీ...
మొండి బకాయిల రికవరీ కోసం రూపొందించిన దివాలా చట్టం మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియ కారణంగా బ్యాంకులు ఇచ్చిన రుణాల కంటే తక్కువ మొత్తంలోనే రికవరీ కానుండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించనున్నది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోవడం కూడా బ్యాంక్‌లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్‌లో జీడీపీ ఐదేళ్ల కనిష్ట స్థాయికి, 5.8 శాతానికి పడిపోయింది.

జీడీపీ క్షీణత కారణంగా వ్యవసాయ, రియల్టీ, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగాలకు  ఇచ్చిన రుణాలు మొండిగా మారిపోయే ప్రమాదమూ లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఒత్తిడి ఖాతాల కోసం మూలధన నిధులను కేటాయిస్తున్నాయి. భూషణ్‌ స్టీల్, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్స్‌ అండ్‌ మోనెట్‌ ఇస్పాత్, జెట్‌ ఎయిర్‌వేస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు...ఇలా ఒత్తిడి ఖాతాలకు నిధులను కేటాయిస్తున్నాయి. ఇది ఆందోళనకరం.  ఎస్సార్‌ స్టీల్, భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్‌లకు సంబంధించిన దివాలా కేసులు పూర్తిగా పరిష్కారమైతే, బ్యాంక్‌లకు మొండి బకాయిల భారం ఒకింత తీరుతుంది. ఈ కేసులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం కల్లా పరిష్కారం అవుతాయన్న అంచనాలు నెలకొన్నాయి.

రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు...
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర ప్రభుత్వం రూ.52,000 కోట్ల మేర నిధులందించింది. దీంతో కలుపుకొని మొత్తం రెండేళ్లలో రూ.2 లక్షల కోట్లు అందించినట్లయింది. ఈ నిధుల్లో అధిక మొత్తాలను బ్యాంక్‌లు మొండిబకాయిల ‘కేటాయింపులకే’ కేటాయించాయి. అయినప్పటికీ, గత క్యూ4లో బ్యాంక్‌ల నష్టాలు తగ్గలేదు.  రుణ నాణ్యత తగ్గడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల రుణ మంజూరీలు కూడా తగ్గాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌లు జోరుగా రుణాలిస్తుండగా, ప్రభుత్వ బ్యాంక్‌లు మాత్రం రుణ నాణ్యతను మెరుగుపరచుకోవడంపైననే దృష్టి పెట్టాయి. ఉదాహరణకు చూస్తే, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  రుణ–డిపాజిట్‌ నిష్పత్తి 2017లో 64 శాతం,  గతేడాది 72 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణ–డిపాజిట్‌ నిష్పత్తి 95, 91 శాతాలుగా నమోదైంది.  

కంపెనీలకు తగ్గుతున్న రుణాలు..
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.., ఇతర రుణాలతో పోల్చితే కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు ఈ ఏడాది ఏప్రిల్‌లో తగ్గాయి. కంపెనీలకు బ్యాంక్‌లు ఇచ్చిన రుణాలు 12 శాతం తగ్గాయి. మరోవైపు వాహన కొనుగోళ్ల రుణాలు 5 శాతం, ఇతర వ్యక్తిగత రుణాలు 21 శాతం, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల రుణాలు 1 శాతం మేర పెరిగాయి. మధ్య స్థాయి సంస్థలకు ఇచ్చిన రుణాలు 4 శాతం ఎగిశాయి.  

మెరుగుపడుతున్న రుణ నాణ్యత
ఇక రుణ నాణ్యత మెరుగుదల అన్ని బ్యాంక్‌ల్లో ఒకేలా లేదు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) స్థూల మొండి బకాయిలు 23 శాతం తగ్గి రూ.1.73 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. తాజా మొండి బకాయిలపై నియంత్రణ సాధించామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార వ్యాఖ్యానించారు. రుణ నాణ్యత మరింతగా మెరుగుపడిందని, ఒత్తిడి ఖాతాలకు తగిన కేటాయింపులు జరిపామని పేర్కొన్నారు. దాదాపు ఏడు క్వార్టర్ల పాటు నష్టాలు ప్రకటిస్తూ వచ్చిన యునైటెట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత క్యూ4లో లాభాల బాట పట్టింది. ఈ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు 27 శాతం తగ్గి రూ.12,053 కోట్లకు తగ్గాయి. రుణ నాణ్యత మెరుగుదల పరంగా చూస్తే, ప్రభుత్వ బ్యాంక్‌ల కంటే ప్రైవేట్‌ బ్యాంక్‌లదే పై చేయిగా ఉంది. ఈ విషయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ముందు వరుసలో ఉంది. ఈ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు 14 శాతం తగ్గి రూ.46,292 కోట్లకు చేరాయి.  

ప్రైవేట్‌ బ్యాంక్‌లకూ పాకుతున్న సమస్య...
మొండి బకాయిల విషయంలో కొన్ని ప్రైవేట్‌ బ్యాంక్‌లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పోటీ పడుతున్నాయి.  స్థూల మొండి బకాయిల పెరుగుదల విషయంలో యస్‌బ్యాంక్‌ను చెప్పుకోవాలి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు 200 శాతం ఎగసి రూ.7,883 కోట్లకు పెరిగాయి. ఒక విమానయాన సంస్థ(జెట్‌ ఎయిర్‌వేస్‌ కావచ్చు), మౌలిక రంగ దిగ్గజం(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌) బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించామని, అందుకే గత క్యూ4లో మొండి బకాయిలు భారీగా పెరిగాయని యస్‌ బ్యాంక్‌ యాజమాన్యం వెల్లడించింది.

ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్థూల మొండి బకాయిలు 131 శాతం పెరిగి రూ.3,947 కోట్లకు చేరాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీల బకాయిలను మొండి బకాయిలుగా గుర్తించడం వల్ల ఈ బ్యాంక్‌ మొండిబకాయిలు ఇంతగా పెరిగాయి. ఈ బ్యాంక్‌కు మొండి భారం మరింతగా ఉండనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బ్యాంక్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలకు, ఎస్సెల్, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఇతర కొన్ని కంపెనీలకు బాగానే రుణాలిచ్చిందని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. మొత్తం మీద ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లను మొండి బకాయిల సమస్య ఇప్పట్లో వదిలేలా లేదు.

>
మరిన్ని వార్తలు