నేటి నుంచే రుణ మేళాలు

3 Oct, 2019 05:35 IST|Sakshi

ప్రభుత్వరంగ బ్యాంకుల ఆధ్వర్యంలో 250 జిల్లాల్లో నిర్వహణ

పాల్గొననున్న ఎన్‌బీఎఫ్‌సీలు

రిటైలర్లు, ఎంఎస్‌ఎంఈలకు రుణాల మంజూరు

న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన రుణ మేళా కార్యక్రమాలు గురువారం నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ప్రారంభమవుతాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలతో కలసి వీటిని నిర్వహిస్తాయి. రిటైల్‌ కస్టమర్లతోపాటు వ్యాపారస్థులకు కూడా రుణాలను అప్పటికప్పుడు మంజూరు చేయడమే వీటి నిర్వహణ ఉద్దేశ్యం. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) వ్యాపార పరమైన రుణాలను బ్యాంకులు అందించనున్నాయి. ముఖ్యమైన పండుగల సమయంలో రుణాల మంజూరీని పెంచడం ద్వారా నిదానించిన డిమాండ్‌ను, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వరంగ బ్యాంకులను రుణ మేళాలు నిర్వహించాలని కోరింది. దీంతో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ఇందులో పాలు పంచుకునేందుకు ప్రైవేటు బ్యాంకులు కూడా ఆసక్తి తెలిపాయి.  

48 జిల్లాల్లో ఎస్‌బీఐ...
ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బ్యాంకు ఆఫ్‌ బరోడా(బీవోబీ), కార్పొరేషన్‌ బ్యాంకులు పండుగల సమయంలో రుణాల డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా ముందుండి నడిపించనుంది. 17 జిల్లాల్లో బీవోబీ లీడ్‌బ్యాంకర్‌గా వ్యవహరించనుంది. ఇదే సమయంలో బరోడా కిసాన్‌ పఖ్వాడా పేరుతో వ్యవసాయ రుణాల మంజూరీపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు బీవోబీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకు సేవలు కస్టమర్లకు మరింత చేరువ కానున్నాయి. తొలి దశలో రుణ మేళాలు జరిగే 250 జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను బ్యాంకులు చేపట్టనున్నాయి. స్థానిక వర్తకుల ద్వారా రుణ మేళాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయనున్నట్టు ఓ బ్యాంకర్‌ తెలిపారు. ఇక రెండో దశ కింద దేశవ్యాప్తంగా మరో 150 జిల్లాల్లో రుణ మేళాలు ఈ నెల 21 నుంచి 25 వరకు జరుగుతాయి.

మరిన్ని వార్తలు