‘మిషన్‌ గాంధీగిరీ’తో రూ. 1,800 కోట్ల రికవరీ

21 Apr, 2018 00:19 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అంచనా

న్యూఢిల్లీ: మొండిబాకీలను రాబట్టుకునేందుకు దాదాపు ఏడాదికాలంగా కొనసాగిస్తున్న మిషన్‌ గాంధీగిరీ ద్వారా .. రూ. 1,800 కోట్లు రికవరీ కాగలవని ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) అంచనా వేస్తోంది. గతేడాది మేలో ప్రారంభించిన ఈ కార్యక్రమంతో సానుకూల ఫలితాలనిస్తోందని, సగటున నెలకు రూ. 150 కోట్ల మేర వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్‌ వర్గాలు తెలిపాయి.

మొండిబాకీదారుల పేర్లను బైటపెట్టడం ద్వారా వారిపై సామాజికంగా ఒత్తిడి పెంచి, బాకీలు రాబట్టుకోవాలన్నది మిషన్‌ గాంధీగిరీ ఉద్దేశమని పేర్కొన్నాయి. బ్యాంకు సర్కిల్స్‌ అన్నింట్లోనూ ఇందుకోసం ప్రత్యేకంగా రికవరీ టీమ్‌ కూడా ఏర్పాటు చేసినట్లు పీఎన్‌బీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మొండిబాకీలపై పీఎన్‌బీ తీసుకుంటున్న చర్యల ఫలితంగా గత కొన్ని నెలల్లో 150 పైచిలుకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పాస్‌పోర్టులను జప్తు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గత తొమ్మిది నెలల్లో డిఫాల్టర్లపై 37 ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదైనట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు