పీఎన్‌బీకి మొండిబాకీల సెగ..

3 Nov, 2018 00:23 IST|Sakshi

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ కుంభకోణం దెబ్బతో కుదేలయిన ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మరోసారి భారీ నష్టాలు ప్రకటించింది. మొండిబాకీలకు కేటాయింపుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా రూ.4,532 కోట్ల నష్టం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంకు రూ.561 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా ఫలితాలతో పీఎన్‌బీ సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన వరుసగా మూడు త్రైమాసికాల్లో నష్టాలు ప్రకటించినట్లయింది.

పీఎన్‌బీ మార్చి క్వార్టర్లో రూ. 13,417 కోట్లు, జూన్‌ త్రైమాసికంలో రూ.940 కోట్ల మేర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. నీరవ్‌ మోదీ కుంభకోణంతో తలెత్తిన సంక్షోభానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టి, లాభాల్లోకి మళ్లాలని నిర్దేశించుకున్నట్లు విలేకరుల సమావేశంలో పీఎన్‌బీ ఎండీ సునీల్‌ మెహతా తెలిపారు. దాదాపు రూ.14,357 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇప్పటిదాకా 86 శాతం మొత్తానికి ప్రొవిజనింగ్‌ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.  

తగ్గిన ఆదాయం...
తాజా క్యూ2లో బ్యాంక్‌ ఆదాయం రూ. 14,205 కోట్ల నుంచి రూ. 14,036 కోట్లకు తగ్గింది. ఇచ్చిన రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) రూ. 57,630 కోట్ల నుంచి రూ. 81,251 కోట్లకు పెరగ్గా, నికర ఎన్‌పీఏలు రూ. 34,570 కోట్ల నుంచి రూ.38,279 కోట్లకు చేరాయి.శాతాల వారీగా చూస్తే నికర ఎన్‌పీఏలు 8.44 శాతం నుంచి 8.90 శాతానికి చేరాయి.

మరోవైపు మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు రూ. 2,441 కోట్ల నుంచి రూ. 9,758 కోట్లకు చేరాయి. వీటిలో కేవలం మొండిబాకీలకే  ప్రొవిజనింగ్‌ మూడు రెట్లు పెరిగి రూ.2,694 కోట్ల నుంచి రూ. 7,733 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే అసెట్‌ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. దేశీయంగా రుణాల మంజూరీ స్థూలంగా 14.3 శాతం పెరిగి రూ. 4.47 లక్షల కోట్లకు చేరింది. ప్రొవిజన్‌ కవరేజి నిష్పత్తి 66.92 శాతంగా ఉంది.  

నీరవ్‌ మోదీ స్కామ్‌కు మరో రూ. 3,295 కోట్ల ప్రొవిజనింగ్‌..
నీరవ్‌ మోదీ ఫ్రాడ్‌కి సంబంధించి జూన్‌ 30 నాటిదాకా రూ. 9,042 కోట్ల ప్రొవిజనింగ్‌ జరపగా, సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మరో రూ. 3,295 కోట్లు కేటాయించామని తదుపరి త్రైమాసికంలో మిగతా మొత్తానికి ప్రొవిజనింగ్‌ చేస్తామని సునీల్‌ మెహతా తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్ధంలో రూ. 12,000 కోట్ల మేర రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌కి పరిమిత స్థాయిలో రూ. 2,000 కోట్ల మేర రుణాలిచ్చినట్లు మెహతా పేర్కొన్నారు. కన్సాలిడేషన్‌కన్నా బ్యాంకు కార్యకలాపాలను అంతర్గతంగా పటిష్టపర్చుకోవడంపైనే తక్షణం దృష్టి పెట్టినట్లు చెప్పారు.  

షేరు 7 శాతం డౌన్‌..
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు 7 శాతానికి పైగా పతనమైంది. బీఎస్‌ఈలో 7 శాతం క్షీణించి రూ.69.05 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 8.35 శాతం మేర పతనమై రూ. 68.05 స్థాయిని కూడా తాకింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు 7.20 శాతం క్షీణించి రూ. 68.95 వద్ద క్లోజయ్యింది. బ్యాంకు మార్కెట్‌ విలువ రూ. 1,598 కోట్లు హరించుకుపోయి రూ. 21,229 కోట్లకు పరిమితమైంది.

మరిన్ని వార్తలు