పీఎన్‌బీని వెంటాడుతున్న మొండిబాకీలు

6 Nov, 2019 04:53 IST|Sakshi

క్యూ2లో రూ.507 కోట్ల నికర లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.507 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.4,532 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇతర ఆదాయం అధికంగా ఉండటం,  కేటాయింపులు తక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.14,036 కోట్ల నుంచి రూ. 15,557 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 7% వృద్ధితో రూ.4,264 కోట్లకు పెరిగింది. డిపాజిట్లు 7% పెరిగినా, రుణాలు 0.7 % తగ్గాయి.  

పెరిగిన మొండి బకాయిలు..
గత క్యూ2లో 17.16 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.76 శాతానికి తగ్గాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 16.49 శాతంగానే ఉన్నాయి. ఈ క్యూ1లో 7.17 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.65 శాతానికి పెరిగాయి. ఈ క్యూ1లో రూ.5,412 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.7,460 కోట్లకు పెరిగాయి. అయితే మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గాయి. గత క్యూ2లో రూ.7,733 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ2లో రూ.3,253 కోట్లకు తగ్గాయి. ఇక పూర్తి ఆరి్థక సంవత్సరానికి మొండి బకాయిలు రూ.19,000 కోట్లకు పెరుగుతాయని పీఎన్‌బీ అంచనా వేస్తోంది.

.

మరిన్ని వార్తలు