అప్పట్లో ‘విన్‌సమ్‌’ మెహతా .. ఇప్పుడు నీరవ్‌ మోదీ..

17 Feb, 2018 01:55 IST|Sakshi

రెండు మోసాల్లోనూ పీఎన్‌బీకే భారీ నష్టం

విన్‌సమ్‌ కుంభకోణం రూ. 6,800 కోట్లు  

వజ్రాభరణాల డిజైనర్‌ నీరవ్‌ మోదీ రూ. 11,400 కోట్ల కుంభకోణం.. కొన్నాళ్లక్రితం నాటి విన్‌సమ్‌ డైమండ్‌ గ్రూప్‌ కుంభకోణాన్ని తలపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఈ రెండు సందర్భాల్లోనూ ఎక్కువగా దెబ్బతిన్న బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకే.  విన్‌సమ్‌ డైమండ్‌ గ్రూప్‌ కుంభకోణం విషయానికొస్తే..  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకింగ్‌ స్కామ్‌గా దీన్ని లెక్కేస్తారు.

విన్‌సమ్‌ గ్రూప్‌ ప్రమోటరు జతిన్‌ మెహతా కూడా భారీ కార్పొరేట్‌ డిఫాల్టర్లలో ఒకరు. అయిదేళ్ల క్రితం ఈ కుంభకోణం బైటపడింది. అప్పట్లో .. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ సారథ్యంలోని కన్సార్షియం నుంచి విన్‌సమ్‌ డైమండ్‌ గ్రూప్‌నకు చెందిన విన్‌సమ్‌ డైమండ్‌ అండ్‌ జ్యుయలర్స్, ఫరెవర్‌ ప్రెషియస్‌ డైమండ్‌ అండ్‌ జ్యుయలరీ, సూరజ్‌ డైమండ్స్‌ సంస్థలు రూ. 6,800 కోట్లు రుణం తీసుకున్నాయి. ఇందులో పీఎన్‌బీనే అత్యధికంగా రూ. 1,800 కోట్లు ఇచ్చింది.  

మోదీ కేసులోని లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ తరహాలోనే బ్యాంకులు .. విన్‌సమ్‌ గ్రూప్‌ కంపెనీలకు అంతర్జాతీయ బులియన్‌ బ్యాంకులు బంగారాన్ని సరఫరా చేసేందుకు వీలుగా స్టాండ్‌బై లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇచ్చాయి. వీటి ప్రకారం.. బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఒకవేళ విన్‌సమ్‌ గ్రూప్‌ సంస్థలు గానీ నిధులు చెల్లించడంలో విఫలమైతే.. ఆ మొత్తాలను బులియన్‌ బ్యాంకులకు ఈ బ్యాంకులు కట్టాల్సి ఉంటుంది. 

విన్‌సమ్‌ గ్రూప్‌.. కొన్నాళ్లకి గల్ఫ్‌ దేశాల్లోని కొందరు కస్టమర్లు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌లో 1 బిలియన్‌ డాలర్లు నష్టపోవడంతో తమకు రావాల్సిన బాకీలు కట్టలేదన్న కారణంతో బులియన్‌ బ్యాంకులకు కట్టడం మానేసింది. 2013లో డిఫాల్ట్‌లు మొదలయ్యాయి. అదే ఏడాది విన్‌సమ్‌ డైమండ్‌ గ్రూప్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి. దీనిపై పీఎన్‌బీ ఫిర్యాదుతో ప్రారంభమైన సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. అప్పట్నుంచి మెహతా కుటుంబసభ్యులు ఇప్పటిదాకా భారత్‌ రాలేదు. కొందరు సెయింట్‌ కిట్స్‌ పౌరసత్వం తీసుకున్నారని.. సింగపూర్, దుబాయ్‌లలో సెటిల్‌ అయిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు