తెలివైన పెట్టుబడులు పెట్టాలి

14 Oct, 2017 01:23 IST|Sakshi

మహిళలకు బజాజ్‌ క్యాపిటల్‌ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వ్యాఖ్య

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని రంగాల్లో పురోగమిస్తున్న మహిళలు.. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని బజాజ్‌ క్యాపిటల్‌ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ.. మహిళా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మహిళలు– సంపద’ అంశంపై పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ జరిగిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్‌ ఈ విషయాలు చెప్పారు.

పెట్టుబడుల విషయంలో వివేకవంతంగా వ్యవహరించాలని మహిళలకు సూచించారు. మరోవైపు, ఎకానమీ మొదలైన వాటి పరిస్థితులు ఎలా ఉన్నా... స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుని, క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగించాలని కటింగ్‌ ఎడ్జ్‌ వ్యవస్థాపకుడు గౌరవ్‌ మష్రువాలా సూచించారు. ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్‌ చైర్‌పర్సన్‌ కామిని సరాఫ్, వైజ్‌ ఇన్వెస్ట్‌ అడ్వైజర్స్‌ సీఈవో హేమంత్‌ రస్తోగి, కరమ్‌యోగ్‌ నాలెడ్జ్‌ అకాడెమీ వ్యవస్థాపకుడు అమిత్‌ త్రివేది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు, వచ్చే రెండేళ్లలో బజాజ్‌ క్యాపిటల్‌ సంస్థ రుణ కార్యకలాపాల విభాగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు రాజీవ్‌ వెల్లడించారు. ప్రస్తుతం తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.20,000 కోట్లుగా ఉండగా.. అయిదేళ్లలో ఇది రూ. లక్ష కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు