మిగిలిన డబ్బు ఫండ్స్‌లో పెట్టండి!

10 Aug, 2015 01:18 IST|Sakshi
మిగిలిన డబ్బు ఫండ్స్‌లో పెట్టండి!

నా పేరు శశికాంత్. వయసు 35 ఏళ్లు. ఐదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా. భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. నా నెల జీతం రూ.75,000. ఇంటద్దెతో కలిసి ప్రతి నెలా రూ.35,000 ఖర్చవుతోంది. నా ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే ఎల్‌ఐసీకి చెందిన రెండు న్యూ బీమా గోల్డ్ పాలసీలు తీసుకున్నా. ఈ రెండింటి బీమా రక్షణ మొత్తం రూ.8.50 లక్షలు. ఇందుకోసం ఏటా ప్రీమియం రూపంలో రూ.45,000 చెల్లిస్తున్నా. అలాగే పన్ను మినహాయింపుల కోసం ఏప్రిల్, 2014 నుంచి నెలకు రూ. 2,000 చొప్పున ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. దీంతోపాటు ఏప్రిల్ 2011 నుంచి నెలకు రూ.3,000 చొప్పున ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. నా ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలు సరిగానే ఉన్నాయా? లేక ఏమైనా మార్పులు చేయాల్సి ఉందా?
- శశికాంత్, హైదరాబాద్
 
- దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఒకటోరెండో ఫండ్స్‌ను నమ్మొద్దు
- మార్కెట్ రిస్క్‌ను తట్టుకోవాలంటే వైవిధ్యం ఉండాలి
- శశికాంత్! జీతానికి తగ్గ బీమా రక్షణ కూడా తీసుకోండి
- రైట్ హొరైజన్స్ సీఈఓ అనిల్ రెగో సూచన
 
శశికాంత్! బోలెడన్ని సాధనాలవైపు చూడకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రెండు రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలైన బీమా, మ్యూచువల్ ఫండ్స్‌కే కేటాయించడాన్ని అభినందిస్తున్నాను. మీరిచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలో మీరు కొద్దిస్థాయి రిస్క్ చేయగలరని అర్థమవుతోంది. మీ మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌లో అత్యధిక భాగం... అంటే 62.57 శాతం బీమాకు కేటాయిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌కి  37.43 శాతం కేటాయించారు. మీరు  20 ఏళ్ళ కాలానికి దీర్ఘకాలిక సంప్రదాయ బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి అంచనా వేస్తే బీమా పథకాలపై 6 శాతం రాబడిని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం విలువ రూ. 9.47 లక్షలు.

 
బీమా..
ప్రస్తుతం మీకు బీమా రక్షణ రూ. 8.5 లక్షలు మాత్రమే ఉంది. మీ ఆదాయానికి, బాధ్యతలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. కాబట్టి మరింత బీమా రక్షణ పెంచుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం తక్కువ ప్రీమియంతో అధిక బీమా రక్షణ కల్పించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను తీసుకోండి. మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు తగినంతగా బీమా రక్షణ ఉండేలా చూసుకోవాలి.
 
మ్యూచువల్ ఫండ్స్..

మీరు రెండు మంచి ఫండ్స్‌ను ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ పథకాల్లోకి పెట్టుబడిని మరింత పెంచడంతో పాటు పోర్ట్‌ఫోలియోలకి మరిన్ని ఫండ్స్‌ను జత చేసుకోండి. ఇందుకోసం పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసం మిడ్ అండ్ స్మాల్ క్యాప్, బ్యాలెన్స్‌డ్ ఫండ్ కేసి చూడండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో సంపద పెరగడంతో పాటు, పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. దీర్ఘకాలిక ఈక్విటీ రాబడులపై ఎటువంటి పన్ను ఉండదన్న సంగతి తెలుసు కదా!. మ్యూచువల్ ఫండ్స్‌లో మరింత పెట్టుబడుల కోసం ఈ పక్కనున్న పథకాలను పరిశీలించండి.


- ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ క్యాప్ ఫండ్స్
- ఐసీఐసీఐ వేల్యూ డిస్కవరీ ఫండ్
- ఎల్ అండ్ టీ ఈక్విటీ ఫండ్
- ఎడల్‌వీజ్ ఎడ్జ్ టాప్ 100 ఫండ్
- టాటా బ్యాలెన్స్‌డ్ ఫండ్
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ ఫండ్

 
ఇలా చేయండి..

క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసేలా పోర్ట్‌ఫోలియోను రూపొందిం చుకోవాలి. అలాగే తగినంత జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా ఉండే విధంగా చూసుకోవాలి. ఇందుకోసం కుటుంబం మొత్తానికి ఆరోగ్య బీమా రక్షణను కల్పించే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోండి. ఇది అత్యవసర సమయాల్లో వైద్య చికిత్సావ్యయాలకు అక్కరకు వస్తుంది.
 
ముఖ్యాంశాలు..

దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకేరకమైన వాటిల్లో కాకుండా పెట్టుబడిలో వైవిధ్యం ఉండే విధంగా చూసుకోవాలి. దీనివల్ల మార్కెట్లో ఉండే ఒడిదుడుకులను తట్టుకోగలరు. ఇన్వెస్ట్ చేస్తూ పోవడమే కాకుండా మధ్యమధ్యలో వాటి పనితీరును పరిశీలించండి. అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటే చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విధానం అనుసరించడం ద్వారా మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలరు.
 


మీ పెట్టుబడులు ఇప్పుడు ఇలా ఉన్నాయి


ఇలా మార్చుకోవాలి
 
 
ఇక మీ ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఇంకా రూ.31,000 పొదుపు చేసే సామర్థ్యం మీకుంది. ఈ మొత్తాన్ని పట్టికలో చూపిన విధంగా ఇన్వెస్ట్ చేయండి.


మరిన్ని వార్తలు