ఆ పజిల్‌ విప్పితే.. తిరిగి వచ్చేస్తా

20 Dec, 2019 11:09 IST|Sakshi

అటు ఆర్థిక మందగమనం, ఇటు స్టాక్‌మార్కెట్లు పరుగు 

ఇదో పజిల్‌ అంటున్న అరవింద్‌ సుబ్రమణియన్‌

అహ్మదాబాద్‌: ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రభుత్వ  మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ మరోసారి భారత ఆర్థికవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకు పోతోంటే, మరోవైపు స్టాక్ మార్కెట్లు మాత్రం ఉత్సాహంగా పైపైకి దూసుకుపోవడం తనకు  ఒక పజిల్‌గా వుందని వ్యాఖ్యానించారు. ఇదొక పజిల్‌గా తనకు గోచరిస్తోందని, దీన్ని తనకు అర్థం చేయిస్తే  తాను తిరిగి దేశానికి వస్తానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు దీనిపై పరిశోధన జరగాల్సిన అవసరం వుందని కూడా ఆయన పిలుపునిచ్చారు. 

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ (ఐఐఎం-ఎ), ఎన్‌ఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ ఐసీఎఫ్‌టి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఎన్‌ఎస్‌ఇ సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్స్ ఇన్ ఫైనాన్స్, ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుబ్రమణియన్ మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్షీణిస్తుందో, స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతోందో  వివరించాలన్నారు. మొట్టమొదటి సెంటర్ ఫర్ బిహేవియరల్ సైన్సెస్ డొమైన్ ఈ  చిక్కుముడిని విప్పగలిగితే.. తాను అమెరికానుంచి ఇండియాకు తిరిగి వచ్చేస్తానన్నారు. అలాగే ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన కేవలం ఆర్ధికశాస్త్రం, ఫైనాన్స్, మార్కెటింగ్లాంటి వాటికి మాత్రమే ఈ ప్రాజెక్ట్‌ పరిమితం కాకుండా ఎకనామిక్స్‌లోని కొన్ని పరిస్థితులకు మానవుల స్పందన ఎలా వుంటుందనే అసాధారణమైన విషయాలపై దృష్టి పెట్టాలని  ఆయన సూచించారు. 

ఈ కార్యక్రమంలో ఐఐఎం-ఎ డైరెక్టర్ ఎర్రోల్ డిసౌజా , మార్కెటింగ్ అండ్‌ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్యాకల్టీ సభ్యుడు అరవింద్ సహాయ్ తదితరులు పాల్గొన్నారు.  ఆర్థిక మార్కెట్లు, ఆర్థిక సేవల్లోని వ్యాపార సమస్యలకు సంబంధించిన అనేక విషయాలలో అవగాహన చేపట్టడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని డిసౌజా తెలిపారు. విధాన రూపకర్తలు, వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు, ఫండ్ నిర్వాహకులు, వ్యాపారులు, విశ్లేషకులు, సంపద సలహాదారులు, ఇతర నిర్వాహకులు ఈ విషయంలో తమకు సహాయపడాలన్నారు.  ఎన్ఎస్ఈ సీఎండీ విక్రమ్ లిమాయే మాట్లాడుతూ జనాభా , పొదుపు , పెట్టుబడి అలవాట్లను రూపొందించడంలో సామాజిక ప్రవర్తనా అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. 

కాగా  పెద్ద నోట్ల రద్దుతో వృద్ధి రేటు తీవ్రంగా దెబ్బతిందనీ, దిగ్భ్రాంతికరమైన నిరంకుశ చర్య అని విమర్శించిన  అరవింద్‌  ‘ఆఫ్‌ కౌన్సెల్‌– ది ఛాలెంజెస్‌ ఆఫ్‌ మోదీ–జైట్లీ ఎకానమీ’ పేరిట ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. 2014 అక్టోబరులో కేంద్ర ఆర్థిక శాఖకు సీఈఏగా మూడేళ్ల కాలానికి సుబ్రమణియన్‌ నియమితులయ్యారు. 2017లో ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. అయితే 2019 మే దాకా పదవీకాలం గడువు ఉన్నప్పటికీ గత ఏడాది అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు