మల్టీప్లెక్స్‌ షేర్ల పతనం- పీవీఆర్‌ నుంచి రైట్స్‌!

22 May, 2020 12:39 IST|Sakshi

నిధుల సమీకరణ బాటలో పీవీఆర్‌!

రైట్స్‌ ఇష్యూ యోచనలో మల్టీప్లెక్స్‌ కంపెనీ

వార్‌బర్గ్‌ పింకస్‌, మల్టిపుల్స్‌ పీఈ ఆసక్తి

రూ. 300 కోట్లు సమీకరించే ప్రణాళికలు

దేశీయ మల్టీప్లెక్స్‌ల దిగ్గజం పీవీఆర్‌ లిమిటెడ్‌.. నిధుల సమీకరణ బాటపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా రైట్స్‌ ఇష్యూని చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. పీవీఆర్‌ సినిమాస్‌ పేరుతో దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌ చైన్‌ నిర్వహిస్తున్న కంపెనీ లాక్‌డవున్‌ కారణంగా ఇటీవల సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించేందుకు పీవీఆర్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే యాక్సిస్‌ కేపిటల్‌ను మర్చంట్‌ బ్యాంకర్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

845 తెరలతో
పీవీఆర్‌ లిమిటెడ్‌ చేపట్టదలచిన రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్లతోపాటు ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన పీఈ దిగ్గజాలు వార్‌బర్గ్‌ పింకస్‌, మల్టీపుల్స్‌ ఆల్టర్నేట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సైతం పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి డేటాబేస్‌ ప్రకారం పీవీఆర్‌ లిమిటెడ్‌లో ప్రమోటర్ల వాటా 18.54 శాతంకాగా.. వార్‌బర్గ్‌ పింకస్‌ 12.74 శాతం, మల్టిపుల్స్‌ ఏఏఎం 11.17 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా పీవీఆర్‌ 176 ఆస్తులను కలిగి ఉంది. తద్వారా 845 తెరల(స్ర్కీన్స్‌)ను నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ క్విప్‌ ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకుంది.

లాక్‌డవున్‌ 
కోవిడ్‌-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు, మాల్స్‌ మార్చి నుంచి తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో మల్టీప్లెక్స్‌ రంగంలో ఆదాయాలకు గండి పడింది. మరోపక్క మూవీ నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా సినిమాలను విడుదల చేసే ప్రణాళికలు వేస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఓటీటీ ద్వారా కాకుండా నేరుగా థియేటర్లలో తొలిసారి విడుదల చేసే సినిమాలను మాత్రమే ప్రదర్శించాలని పీవీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

షేర్లు డీలా
కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల స్టాక్‌ మార్కెట్లలో లిస్టయిన మల్టీప్లెక్స్‌ కంపెనీలు పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వెరసి గత మూడు నెలల్లో పీవీఆర్‌ షేరు 57 శాతం పతనంకాగా.. ప్రత్యర్ధి కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ షేరు సైతం 55 శాతం దిగజారింది. కాగా.. జులైకల్లా తిరిగి మల్టీప్లెక్స్‌ల కార్యకలాపాలు ప్రారంభంకాగలవని పీవీఆర్‌ భావిస్తోంది. ఆగస్ట్‌ రెండో వారం నుంచీ బిజినెస్‌ పుంజుకోగలదని ఆశిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో పీవీఆర్‌ షేరు 2 శాతం క్షీణించి రూ. 864 వద్ద ట్రేడవుతోంది. ఈ ఫిబ్రవరి 25న రూ. 2125 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక రూ. 512 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన ఐనాక్స్‌ లీజర్‌ ప్రస్తుతం 2 శాతం నీరసించి రూ. 212 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు