సైయెంట్‌ జోరు- ఎల్‌అండ్‌టీ టెక్‌ డీలా

17 Jul, 2020 14:40 IST|Sakshi

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

4 శాతం జంప్‌చేసిన సైయెంట్‌ షేరు

4 శాతం పతనమైన ఎల్‌అండ్‌టీ టెక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీలు సైయెంట్‌ లిమిటెడ్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ కౌంటర్లకు ఇన్వెస్టర్ల నుంచి మిశ్రమ స్పందన ఎదురవుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సైయెంట్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 296 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 311 వరకూ ఎగసింది. అయితే మరోవైపు ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ షేరు దాదాపు 4 శాతం పతనమైంది. రూ. 1390 దిగువన కదులుతోంది. తొలుత రూ. 1341 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. ఫలితాల వివరాలు చూద్దాం..

సైయెంట్‌ లిమిటెడ్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో సైయెంట్‌ నికర లాభం 80 శాతం జంప్‌చేసి రూ. 81 కోట్లను అధిగమించింది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 9 శాతం క్షీణించి రూ. 1089 కోట్లను తాకింది. అయితే వార్షిక ప్రాతిపదికన నికర లాభం 10 శాతం తగ్గడం గమనార్హం. ఇక పన్నుకు ముందు లాభం సైతం 26 శాతం ఎగసి రూ. 109 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. కాగా.. అంచనాలకంటే అధికంగానే క్యూ1లో 13.06 కోట్ల డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు సైయెంట్‌ ఎండీ, సీఈవో బి.కృష్ణ చెప్పారు. ఏరోస్పేస్‌ మినహా మిగిలిన విభాగాలలో పటిష్ట డిమాండ్ కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ రూ. 117 కోట్ల  నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 42 శాతం క్షీణతకాగా..  మొత్తం ఆదాయం 4 శాతం తక్కువగా రూ. 1295 కోట్లను తాకింది. డాలర్ల రూపేణా ఆదాయం 17.1 కోట్లకు చేరింది.  ఇక నిర్వహణ లాభ మార్జిన్లు 12.1 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో టెక్సాస్‌ కంపెనీ ఆర్కెస్ట్రా టెక్నాలజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌ పేర్కొంది. కోవిడ్‌ కారణంగా కంపెనీ పనితీరు ప్రభావితమైనట్లు తెలియజేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా