క్యూ2 ఫలితాలు నడిపిస్తాయ్‌...

6 Nov, 2017 01:52 IST|Sakshi

ఈ వారమే ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ ఫలితాలు  

జీఎస్‌టీ మండలి సమావేశ ప్రభావం  

మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ పెట్టుబడులు

ఈ వారంలో వెలువడే పలు కంపెనీల క్యూ2 ఫలితాలు..మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు అసోంలోని గౌహతిలో ఈ నెల 9–10 మధ్య జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు.

అధిక పన్ను రేటు –28 శాతం ట్యాక్స్‌ స్లాబ్‌లో ఉన్న కొన్ని వస్తువులను తక్కు వ ట్యాక్స్‌ స్లాబ్‌లోకి మార్చే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. ఈ వారంలో వెలువడే నగదు సరఫరా గణాంకాలు దేశంలోని లిక్విడిటీ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని, ఈ అంశం మార్కెట్‌పై ఒకింత ప్రభావం చూపించవచ్చని నిపుణులంటున్నారు. డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పరిణామాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది.  

బ్లూ చిప్‌ కంపెనీల ఫలితాలు...
ఈ వారంలో కీలకమైన బ్లూ చిప్‌కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడుతాయి. నేడు(సోమవారం–ఈ నెల 6)  ఇండియన్‌ బ్యాంక్, హడ్కో  కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. రేపు(మంగళవారం– ఈ నెల 7న) భెల్, సిప్లా, ఫ్యూచర్‌ రిటైల్, ఈ నెల 8 (బుధవారం) అరవింద్, అశోక్‌ లేలాండ్,, గురువారం (ఈ నెల 9న) టాటా మోటార్స్, సెయిల్, అరబిందో ఫార్మా, హెచ్‌పీసీఎల్, ఈ నెల 10న(శుక్రవారం) ఎస్‌బీఐ, ఆయిల్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైజర్, ఇక శనివారం(ఈ నెల 11న) కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌టీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి.  

సానుకూలంగానే సెంటిమెంట్‌..!  
మార్కెట్‌ సెంటిమెంట్‌ సానుకూలంగానే ఉందని అరిహంత్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ డైరెక్టర్‌ అనిత గాంధీ పేర్కొన్నారు. అయితే ముడి చమురు ధరలు పెరగడం ఒకింత ఆందోళన కలిగించే అంశమని వివరించారు.

కంపెనీల క్యూ2 ఫలితాలను బట్టే సమీప భవిష్యత్తులో మార్కెట్‌ గమనం ఆధారపడి ఉంటుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ (రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇప్పటిదాకా వచ్చిన ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ అంతా సవ్యంగా ఉందని చెప్పే స్పష్టమైన పోకడ ఏదీ ఇప్పటిదాకా వెల్లడి కాలేదని పేర్కొన్నారు. జీఎస్‌టీ, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం ఇంకా స్పష్టత లేదని చెప్పారు.
 
ఎన్‌హెచ్‌ఏఐ నిషేధం..
సరైన సమయానికి కాంట్రాక్టులు పూర్తిచేయకపోవడంతో కొన్ని కంపెనీలపై నేషనల్‌ హైవేస్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) నిషేధం విధించడం ఆయా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఎల్‌ అండ్‌ టీ, హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, మధుకాన్, సుప్రీమ్‌ ఇన్‌ఫ్రా తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, యూరోపియన్‌ యూనియన్‌కు సంబంధించి తయారీ, సేవల రంగాలకు చెందిన పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు వస్తాయి. చైనా దిగుమతులు, అమెరికా ముడి చమురు ఎగుమతులు, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారమే వస్తాయి.

మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ పెట్టుబడులు...
రెండు నెలల భారీ అమ్మకాల అనంతరం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత నెలలో ఈక్విటీ మార్కెట్లో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌పీఐలు గత నెలలో మన స్టాక్‌ మార్కెట్లో రూ.3,055 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.2.11 లక్షల కోట్ల మూలధన నిధులు, రహదారుల అభివృద్ధి కోసం రూ. 6 లక్షల కోట్లు అందించాలన్న నిర్ణయాలతో ఈ స్థాయి పెట్టుబడులు వచ్చాయని నిపుణులంటున్నారు.


రేపు హెచ్‌డీఎఫ్‌సీ స్డాండర్డ్‌ లైఫ్‌ ఐపీఓ
హెచ్‌డీఎఫ్‌సీ స్డాండర్డ్‌ లైఫ్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రేపు(ఈ నెల 7న– మంగళవారం) ప్రారంభం కానున్నది. రూ.275–290 ప్రైస్‌బాండ్‌తో రూ.8,695 కోట్ల సమీకరణ కోసం వస్తున్న ఈ ఐపీఓ ఈ నెల 9న ముగియనున్నది. కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేయాలి.

ఈ షేర్లు ఈ నెల 17న స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ కావచ్చు. ఈ నెల 2న ప్రారంభమైన ఖదిమ్‌ ఐపీఓ నేడు ముగుస్తోంది. ఇక నేడు (సోమవారం) రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతున్న తొలి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ ఇది. రూ.247–252 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా  ఈ కంపెనీ రూ.1,542 కోట్లు సమీకరించింది. 

మరిన్ని వార్తలు