టైటాన్‌ నికర లాభం రూ.301 కోట్లు

10 Nov, 2018 01:50 IST|Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.301 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత క్యూ2లో రూ.278 కోట్ల నికర లాభం వచ్చిందని, ఈ క్యూ2లో 8% వృద్ధి సాధించామని టైటాన్‌ కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,603 కోట్ల నుంచి రూ.4,595 కోట్లకు పెరిగిందని టైటాన్‌ సీఎమ్‌డీ భాస్కర్‌ భట్‌ చెప్పారు. జ్యూయలరీ విభాగం ఆదాయం 29 శాతం పెరగి రూ.3,582 కోట్లకు, వాచ్‌ల విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ.676 కోట్లకు, కళ్లజోళ్ల విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.120 కోట్లకు పెరిగాయని  పేర్కొన్నారు. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యూయలరీ విభాగం అమ్మకాలు పుంజుకున్నాయని భాస్కర్‌ భట్‌ వివరించారు.  వాచ్‌ల అమ్మకాల విషయంలో  అత్యుత్తమ క్వార్టర్లలో ఒకటిగా ఈ క్యూ2 క్వార్టర్‌ నిలిచిందని తెలిపారు. నిర్వహణ లాభం 5 శాతం పెరిగి రూ.467 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ2లో 12.7 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్‌ ఈ క్యూ2లో 10.6 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.  

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో రూ.145 కోట్లు...
ట్రెజరీ కార్యకలాపాల్లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అనుబంధ సంస్థలో రూ.145 కోట్లు ఇన్వెస్ట్‌ చేశామని భాస్కర్‌ భట్‌ తెలిపారు.. వీటి కోసం రూ.29 కోట్ల కేటాయింపులు జరిపామని వివరించారు. 

మరిన్ని వార్తలు