ఆర్థికాంశాలు, అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచి

1 Jun, 2020 05:14 IST|Sakshi

11 ఏళ్ల కనిష్టానికి గతేడాది జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యలోటు తీవ్రత

ప్రతికూల అంశాల ప్రభావం మార్కెట్‌పై ఉండనుందన్న నిపుణులు

అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధం

ఈ వారంలోనే ఎస్‌బీఐ, ఇండిగో, బీపీసీఎల్‌ ఫలితాలు

ముంబై: గతవారాంతాన వెల్లడైన పదకొండేళ్ల కనిష్టస్థాయి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు, ద్రవ్య లోటు తీవ్రత వంటి ఆర్థికాంశాలతో పాటు లాక్‌డౌన్‌ను క్రమేపి సడలించడం వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు సోమవారం వెల్లడికానున్న భారత పీఎంఐ తయారీ రంగ డేటా కూడా మార్కెట్‌ దిశపై ప్రభావం చూపనుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ దీపక్‌ జసాని అభిప్రాయపడ్డారు.

నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 నుంచే కేరళను తాకనున్నాయనేది మార్కెట్‌కు సానుకూల అంశంగా పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య ముదురుతోన్న ప్రచ్ఛన్నయుద్ధ అంశంపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయని నిపుణుల విశ్లేషణ. కాగా,  ఈ వారంలో ఎస్‌బీఐ, ఇండిగో, బీపీసీఎల్‌ సహా 75 కంపెనీల ఫలితాలు వెల్లడికానుండడం కీలకాంశం. కాగా, లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి చివరి వారంలో ఈక్విటీల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ నికరంగా రూ.1,230 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, ఏప్రిల్‌ నెలలో రూ.7,965 కోట్ల మేర ఈక్విటీ పెట్టుబడులను విక్రయించాయి. తిరిగి మే నెలలో  ఫండ్స్‌ రూ.2,832 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు