సెవరెన్స్‌ ప్యాకేజీ ఇచ్చి మరీ ఇంటికి పంపేస్తోంది

19 Apr, 2018 15:41 IST|Sakshi

చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ భారీగా ఉద్యోగాల కోత చేపట్టింది.  వార్షికంగా తన వ్యయాలను 1 బిలియన్‌ డాలర్ల మేర తగ్గించుకుంటానని పెట్టుబడిదారులకు ఇచ్చిన వాగ్దానం మేరకు క్వాల్‌కామ్‌ ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఉద్యోగుల కోత ప్రక్రియను ప్రారంభించినట్టు చిప్‌మేకర్‌ క్వాల్‌కామ్‌ బుధవారం  ప్రకటించింది. తమ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులపైనా ఈ ప్రభావం ఉండనుందని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే ఎంతమంది ఉద్యోగులను తీసివేస్తోందో మాత్రం క్వాల్‌కామ్‌ వెల్లడించలేదు. ఉద్యోగుల కోతకు ప్రభావితమయ్యే ఉద్యోగులకు క్వాల్‌కామ్‌ సెవరెన్స్‌ ప్యాకేజ్‌ను ఆఫర్‌ చేస్తోంది. 

దీర్ఘకాలిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి, మార్కెట్‌లో విజయం సాధించడానికి వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడం ఎంతో అవసరమని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.  మొత్తంగా సెప్టెంబర్‌ 24 వరకు కంపెనీలో 33,800 మంది ఫుల్‌-టైమ్‌, పార్ట్‌టైమ్‌, టెంపరరీ ఉద్యోగులున్నారు. క్వాల్‌కామ్‌ చేపట్టబోయే ఉద్యోగాల కోత చాలా పెద్దదని బ్లూమ్‌బర్గ్‌ రిపోర్టు చేసింది. క్వాల్‌కామ్‌ హెచ్చరికల నోటీసులు కూడా ఫైల్‌ చేసినట్టు పేర్కొంది. 1బిలియన్‌ డాలర్ల వార్షిక వ్యయాలను పొదుపు చేసుకోవడానికి తమ వ్యాపారాల వ్యాప్తంగా ఈ తగ్గింపు చేపడుతున్నట్టు క్వాల్‌కామ్‌ జనవరిలో తెలిపింది. పెట్టుబడిదారులకు ఈ మేరకు తాము వాగ్దానం ఇచ్చామని చెప్పింది. తన ఆదాయాల వృద్ధిన మెరుగు పరుచుకునేందుకు తన ఆపరేషన్స్‌ను కూడా ఈ చిప్‌మేకర్‌ సమీక్షిస్తోంది.

మరిన్ని వార్తలు