హైదరాబాద్‌లో క్వాల్‌కామ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

23 Mar, 2017 00:36 IST|Sakshi
హైదరాబాద్‌లో క్వాల్‌కామ్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

టీ–హబ్‌తో చేతులు కలిపిన కంపెనీ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్‌... హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. సంస్థకు ఇప్పటికే బెంగళూరులో ఇలాంటి ల్యాబ్‌ ఒకటుంది. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీ కార్యాలయంలో ఏప్రిల్‌లో ఈ ల్యాబ్‌ను నెలకొల్పుతున్నట్టు క్వాల్‌కామ్‌ ఇండియా ఇంజనీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి రెడ్డి బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. స్టార్టప్‌లు తమ వ్యాపార ప్రణాళికను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు ఈ ల్యాబ్‌ దోహదం చేస్తుందన్నారు. స్టార్టప్‌లు అభివృద్ధి చేసిన ఉత్పాదనకు అనుగుణంగా చిప్‌ల డిజైన్‌ చేపడతామని వెల్లడించారు. కాగా, కంపెనీ ఎంపిక చేసిన స్టార్టప్‌లకే ల్యాబ్స్‌  అందుబాటులో ఉంటాయి. క్వాల్‌కామ్‌ డిజైన్‌ ఇన్‌ ఇండియా (క్యూడీఐపీ) కార్యక్రమం కింద దేశంలో కంపెనీ సుమారు రూ.60 కోట్లు వ్యయం చేస్తోంది.

స్టార్టప్‌లకు ఫండింగ్‌..
క్వాల్‌కామ్‌ డిజైన్‌ ఇన్‌ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా టీ–హబ్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీ–హబ్‌ ఫౌండర్‌ శ్రీనివాస్‌ కొల్లిపర, సీఈవో జయ్‌ కృష్ణన్‌ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టీ–హబ్‌లో ఒక ల్యాబ్‌ను సైతం క్వాల్‌కామ్‌ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్‌ టెక్నాలజీస్, స్మార్ట్‌ సిటీస్‌ లక్ష్యంగా పనిచేస్తున్న స్టార్టప్‌లు ఈ ల్యాబ్‌ను వినియోగించుకోవచ్చు. టీ–హబ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తుంది. ఇక క్యూడీఐపీలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 14 స్టార్టప్‌లను ఎంపిక చేసి ఒక్కొక్కదానికి రూ.6.80 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారు. ఫైనల్స్‌కు చేరిన నాలుగు కంపెనీలకు ఒక్కోదానికి రూ.68 లక్షలు ఇస్తామని శశి రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు