ఎయిర్‌టెల్‌లో ఖతార్‌ ఫౌండేషన్‌ వాటా విక్రయం

9 Nov, 2017 00:35 IST|Sakshi

5 శాతం వాటా అమ్మకం

విలువ రూ.9,500 కోట్లు  

న్యూఢిల్లీ: ఖతార్‌ రాజ కుటుంబానికి చెందిన ఖతార్‌ ఫౌండేషన్‌.. భారతీ ఎయిర్‌టెల్‌లో తనకున్న 5 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయ విలువ రూ.9,500 కోట్లు. ఖతార్‌ ఫౌండేషన్‌ అనుబంధ సంస్థ. త్రి పిల్లర్స్‌ మొత్తం 19.98 కోట్ల షేర్లను రూ.473–480 ప్రైస్‌బాండ్‌లో ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా విక్రయించింది. ఈ షేర్లను విదేశీ, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశాయని సమాచారం. ఈ ధర మంగళవారం ముగింపు ధర(రూ.514)తో పోల్చితే తక్కువ. అయితే ఈ షేర్లను 2013లో ఈ సంస్థ ఒక్కోటి రూ.340కు (మొత్తం షేర్లను రూ.6,796 కోట్లకు) కొనుగోలు చేసింది.

ఈ వాటా విక్రయ నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 3.7 శాతం క్షీణించి రూ.495 వద్ద ముగిసింది.  ఉగ్రవాదానికి ఖతార్‌ ఊతమిస్తుందంటూ సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, బహ్రైన్‌ దేశాలు ఖతార్‌పై ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఖతార్‌ వనరులను సమీకరిస్తోంది. దీంట్లో భాగంగానే ఎయిర్‌టెల్‌లో వాటా విక్రయం జరిగిందని నిపుణులంటున్నారు.   

మరిన్ని వార్తలు